Let's talk: editor@tmv.in
ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఏర్పాట్లు ప‌రిశీలించిన‌ డిప్యూటీ సీఎం

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఏర్పాట్లు ప‌రిశీలించిన‌ డిప్యూటీ సీఎం

Gaddamidi Naveen
8 డిసెంబర్, 2025

ఈ నెల 13న హైదరాబాదులో ఫుట్‌బాల్ సందడి రెట్టింపు కానుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మెస్సీ ఆడబోతున్నాడన్న సమాచారం అభిమానుల్లో ఊపిరి ఆడనివ్వడం లేదు. ఈ స్నేహపూర్వక మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు ప్రారంభించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రాచకొండ సీపీలు స్వయంగా స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. తెలంగాణ రైజింగ్ వేడుకల్లో పాల్గొనే ఆసక్తి మెస్సీ చూపినట్లు భట్టి వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి వేలాది అభిమానులు తరలి రావడంతో ప్రేక్షకులు ముందుగానే స్టేడియానికి వచ్చి సీట్లు ఆక్రమించాలని ఆయన సూచించారు.

మ్యాచ్‌కు వచ్చే అభిమానుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు ఇప్పటికే సిద్ధమయ్యాయని భట్టి చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు, సంస్థల అధినేతలు, సీఈవోలు నగరానికి వస్తుండటంతో భద్రత‌పై పోలీసులు ఎలాంటి రాజీ పడడం లేదని అధికారులు తెలిపారు.

రాచకొండ, హైదరాబాద్ కమిషనర్లు స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లపై పోలీసులు, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర వీఐపీల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు గుర్తించబడ్డాయని. అలాగే ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ స్థలాలు, మెట్రో–ఆర్టీసీ రవాణా సదుపాయాలపై అధికారులు భట్టికి వివరించారు.ఉప్పల్ స్టేడియం ఫుట్‌బాల్ పట్టిన నేపథ్యంలో, ఈ మ్యాచ్ హైదరాబాద్‌ క్రీడా చరిత్రలో మరో గుర్తుండిపోయే ఘట్టంగా నిలవనుందని ఆయ‌న అన్నారు.

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఏర్పాట్లు ప‌రిశీలించిన‌ డిప్యూటీ సీఎం - Tholi Paluku