
ఉపాధి హామీ పధకం.. దందాల మయం!
ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా పేదలు, నిరుపేద కార్మికులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్న అక్రమాల కారణంగా అవి నిరర్ధకం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర లో ఫీల్డ్ అసిస్టెంట్లు, వారికి దిగువనున్న మేట్లు స్థాయిలో మొదలైన అవినీతి బాగోతం అంచెలంచెలుగా చివరిగా ఎక్కడికో చేరి కూలీలు నష్టపోతున్నారు. ఈపథకం కొందరికి కాసులు కురిపించే కల్పవృక్షమయితే, ఇంకొందరికి బంగారుబాతు! ఫలితంగా పథకం ఆశయానికి చెదలుపట్టి అది అపహస్యానికి గురవుతోంది.
ఫీల్డ్ అసిస్టెంట్ ల నుంచి మొదలు
అక్రమాల జాతరలో సూత్రధారులెవరైనా, పాత్రధారులుగా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు తమవంతు పాత్రలను రక్తి కట్టించడంలో పోటీపడుతున్నారు. తాజా, విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలివిడత పనుల్లో చివరి వాయిదాల వేతన బకాయిలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఐదురోజుల క్రితం రాష్ట్రానికి విడుదల చేసిన నేపథ్యంలో గత మూడురోజుల వ్యవధిలో మొత్తం వేతనాలు ఉపాధి శ్రామికుల వ్యక్తిగత బ్యాంకుఖాతాల్లో జమకాడంతో వీటికోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆ శ్రామికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
60 ఏళ్ళు పైబడిన వారే బాధితులు
ఐతే, ఈ వేతనాల్లో సింహ భాగాన్ని కొందరు మేట్లుఆరోగ్య సమస్యలు కారణంగా అటువంటివారిలో శ్రామికుల నుంచి హైజాక్ చేస్తున్నారు. 60 సంవత్సరాల వయసు పైబడిన వారిని ఉపాధి పనుల్లోకి తీసుకోరు. అయితే, గతంలో ఆధార్ కార్డుల్లో పొరపాటున వయసు తక్కువ నమోదైన వారు 60 ఏళ్ళు దాటినా శ్రామికులు గా కొనసాగుతున్నారు. వృద్దాప్యంవల్ల వచ్చే అనేకమంది పనులకు వెళ్లలేక పోతున్నారు. అలాగే, వయసు 60 సంవత్సరాల లోపు ఉన్నప్పటికీ, దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఉపాధి పనులకు వెళ్ళడం లేదు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లుకు అటువంటివారు.
బంగారు బాతులుగా మారు తున్నారు. పనులకు వెళ్లలేని వారిపేరిట దొంగమస్తర్లు వేసి, ఇలా వేతనాలు జమైన వెంటనే వారిముందు వాలిపోయి, వారిని బలవంతంగా బ్యాంకులకు తీసుకువెళ్లి, ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయించి, అందులో నామమాత్రంగా వారి చేతిలో పెట్టి మిగిలిన మొత్తాన్ని వీరు సొంతం చేసుకో వడం ఆనవాయితీగా మారింది. తాజాగా, ఒక్కొక్కరికీ ఐదేసి వారాల వేతనం జమ కాగా, అందులో ఒకవారం సొమ్మును వారికి ఇచ్చి మిగిలిన నాలుగు వారాలది నొక్కేస్తున్నారు.
ప్రతి గ్రూపులో ఇలాంటివారు సుమారు ఆరేడుగురువరకూ ఉంటున్నారు. అంటే, ఒక్కో మేటు కి 30వేల రూపాయలు వరకూఅడ్డదారిలో గిట్టుబాటు అవుతుందన్నమాట. ఇలా, 50 గ్రూపులు ఉండే ఒక గ్రామంలో ఈ తరహా అవినీతి 15 లక్షల వరకూ ఉంటుందని ఓ అంచనా. కనిష్టంగా 10 లక్షల కి తగ్గదని గట్టి అభిప్రాయం. ఈ లెక్కన మండల వ్యాప్తంగా ఎంత? జిల్లావ్యాప్తంగా ఎంత? ఇందులో ఎవరి వాటా ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది.
