Let's talk: editor@tmv.in
ఉపాధ్యాయులను నియమించండి

ఉపాధ్యాయులను నియమించండి

Pinjari Chand
18 సెప్టెంబర్, 2025

‘సార్ సార్ రండి సార్, మా బడికి రండి. మా బడికి ఉపాధ్యాయులను నియమించండి. మా చదువులు సక్రమంగా సాగేటట్లు చేయండి. సార్లు లేక, బుక్కులు తెరవక సగం విద్యా సంవత్సరం పూర్తవుతుంది’ అంటూ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం, బొంకూరు పాఠశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. వారి తల్లిదండ్రులు కూడా టీచర్లను బడికి కేటాయించాలని కోరారు.

నలుగురే ఉపాధ్యాయులు

గ్రామంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో 274 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులే రెగ్యూలర్ వాళ్లు ఉన్నారు. లెక్కలు, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్ట్ లకు ఉపాధ్యాయులే లేరు. నలుగురే పాఠ్యప్రణాళికను చెబుతూ వస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీచర్లను నియమించాలని రాయచూర్-కర్నూల్ రోడ్డెక్కి నిరసన చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో విద్యార్థుల వద్దకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చే వరకు విరమించలేదు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాపాలన వేడుకలు జరగుతున్న వేళ విద్యార్థులు రోడ్డెక్కడం కలకలం రేపింది. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు.

ఉపాధ్యాయులను నియమించండి - Tholi Paluku