Let's talk: editor@tmv.in
‘ఉన్నావ్ దోషి’కేసులో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

‘ఉన్నావ్ దోషి’కేసులో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

Pinjari Chand
30 డిసెంబర్, 2025

2017 ఉన్నావో అత్యాచార కేసులో దోషిగా తేలిన మాజీ ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు జీవితఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ సెంగార్ జైలు నుంచి విడుదల కాడని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ ఏ.జీ. మసీహ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సెంగార్ మరో కేసులోనూ దోషిగా తేలి ఐపీసీ సెక్షన్ 304 (హత్య) కింద శిక్ష అనుభవిస్తున్నాడని కోర్టు గుర్తుచేసింది. ప్రతివాది (సెంగార్) ఇప్పటికే మరో కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నాం. సెంగార్ విడుదల కావద్దని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీబీఐ పిటిషన్‌పై సెంగార్ రెండు వారాల్లో తన ప్రతివాద అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది.

బాధితుల తరఫు స్పందన

బాధితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది హేమంత్ కుమార్ మౌర్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు మంజూరు చేసిన సస్పెన్షన్ ను నిలిపివేసి, నిందితుడు జైలు నుంచే ఉండాలని స్పష్టం చేసింది. బాధితురాలు కూడా ఈ నిర్ణయంపై కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

రాజకీయ, సామాజిక ప్రతిస్పందనలు

కాంగ్రెస్ నేత మహిళా కార్యకర్త ముమ్తాజ్ పటేల్ స్పందిస్తూ ఉన్నావో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే ఆశ పెరిగింది. ఇలాంటి ఘోర నేరాల్లో నిందితులకు మరణశిక్ష విధించేలా కఠిన చట్టం అవసరం అని వ్యాఖ్యానించారు.

బాధితురాలి ఆవేదన

ఇదిలా ఉండగా ఆదివారం ఢిల్లీలో ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఏఐపీడబ్ల్యూఏ) నిర్వహించిన నిరసనలో పాల్గొన్న ఉన్నావో బాధితురాలు, తనకు సుప్రీంకోర్టుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. సెంగార్ బెయిల్ కారణంగా తన కుటుంబం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొందని, సీబీఐ దర్యాప్తు అధికారి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. తన భర్త ఉద్యోగం పోయిందని, పిల్లలు, సాక్షులకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తనకు, సాక్షులకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆమె కోరారు.

కేసు నేపథ్యం

2017: ఉన్నావోలో బాలికపై అత్యాచారం

డిసెంబర్ 2019: కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవితఖైదు శిక్ష, రూ.25 లక్షల జరిమానా

డిసెంబర్ 23, 2025: ఢిల్లీ హైకోర్టు జీవితఖైదు సస్పెన్షన్, బెయిల్

డిసెంబర్ 29, 2025: సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులకు స్టే, సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ సంచలన కేసులో న్యాయ ప్రక్రియపై దేశవ్యాప్తంగా మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది.

ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాను: కుల్దీప్ సెంగార్ కుమార్తె ఓపెన్ లెటర్

2017 ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేయడంతో, సెంగార్ కుమార్తె సోషల్ మీడియాలో భావోద్వేగంగా ఓపెన్ లెటర్ రాసింది. తాము ఎనిమిదేళ్లుగా నిశ్శబ్దంగా, ఓర్పుతో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.

కుమార్తె లేఖలో కీలక ఆరోపణలు

నా గుర్తింపును ‘బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె’ అనే ముద్రతో కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయని, తాము శక్తివంతులమని చెప్పడం అసత్యమని, అన్ని సంస్థలను ఆశ్రయించినా ఎవరూ వినలేదని తెలిపింది. ప్రజా ఆగ్రహం, హ్యాష్‌ట్యాగ్‌ల వల్లే న్యాయ ప్రక్రియ ప్రభావితమవుతోందన్న భయం వ్యక్తం చేసింది.