Let's talk: editor@tmv.in
ఉన్నావ్ అత్యాచార నిందితుడి బెయిల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల నిరసనలు

ఉన్నావ్ అత్యాచార నిందితుడి బెయిల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల నిరసనలు

Dantu Vijaya Lakshmi Prasanna
27 డిసెంబర్, 2025

ఉన్నావ్ అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వెలుపల మహిళా కార్యకర్తలు, నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కోర్టు ఉత్తర్వులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఈ బెయిల్ "మహిళా న్యాయానికి తీరని లోటు" అని వారు అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.

సెంగార్ శిక్షను నిలిపివేయాలన్న కోర్టు నిర్ణయాన్ని నిరసనకారులు ప్రశ్నించారు. భారీగా మోహరించిన పోలీసులు శాంతియుతంగా ఉండాలని కోరారు. సామాజిక కార్యకర్త యోగిత భయానా మాట్లాడుతూ, "మా కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి శాంతియుతంగా వచ్చాము. మా పిటిషన్‌ను వినాలి, లేదంటే నిరసన వ్యక్తం చేయడం మా హక్కు" అని అన్నారు.

కాంగ్రెస్ నాయకురాలు ముంతాజ్ పటేల్ ఈ ఉత్తర్వును విమర్శిస్తూ, సాంకేతిక కారణాలతో సెంగార్‌కు బెయిల్ ఇవ్వడం బాధితురాలి కుటుంబానికే కాకుండా దేశంలోని మహిళలందరి నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ, "అతని బెయిల్‌ను రద్దు చేయాలి. లేదంటే మేము సుప్రీంకోర్టు తలుపు తడతాము. మాకు హైకోర్టుపై నమ్మకం పోయింది" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త కస్టడీ మరణం కేసులో కూడా కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.

కోర్టు తీర్పు నేపథ్యం:

2017 ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సెంగార్, తన శిక్షను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన డివిజన్ బెంచ్, 15 లక్షల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని పేర్కొంటూ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో సెంగార్‌కు 10 ఏళ్ల శిక్ష పడింది. ఆ కేసులో బెయిల్ రాకపోవడంతో అతను ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగుతారు. అలాగే సెంగార్ జైలులోనే ఉండనున్నారు

కాగా కోర్టు నిందితుడుకి అత్యాచార కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ఢిల్లీలో బాధితురాలు నివసించే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదు. బాధితురాలిని లేదా ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించకూడదు. అతను ఢిల్లీలోనే ఉండాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే బాధితురాలి తరపు న్యాయవాది మెహమూద్ ప్రాచా ఈ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో బాధితురాలి

ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమె తండ్రి కస్టడీలోనే మరణించారని ఆయన కోర్టుకు గుర్తు చేశారు.

ఉన్నావ్ అత్యాచార నిందితుడి బెయిల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల నిరసనలు - Tholi Paluku