
‘ఉన్నావో’ దోషికి శిక్ష సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా: బాధితురాలు
2017 ఉన్నావో అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ నేత కులదీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, బాధితురాలు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని బుధవారం ప్రకటించారు. సెంగార్‌కు 2019 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించగా, ఆ తీర్పుపై దాఖలైన అప్పీల్ పెండింగ్‌లో ఉంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం శిక్ష అమలును నిలిపివేసింది. అయితే బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి రావద్దని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించకూడదని కోర్టు షరతులు విధించింది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే బెయిల్ రద్దవుతుందని స్పష్టం చేసింది. బాధితురాలి తండ్రి కస్టడీలో మృతి చెందిన కేసులో సెంగార్‌కు ఇప్పటికే 10 ఏళ్ల జైలు శిక్ష కొనసాగుతుండటంతో, ఆ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం అతడు జైలులోనే కొనసాగనున్నాడు.
హైకోర్టు తీర్పుపై స్పందించిన బాధితురాలు ఢిల్లీలోని తన నివాసం నుంచి ఫోన్ ద్వారా పీటీఐతో మాట్లాడుతూ మా కుటుంబానికి ఇది ‘కాలం’ (మరణం) లాంటి తీర్పు. ఇలాంటి కేసుల్లో దోషులకు బెయిల్ వస్తే దేశంలోని కుమార్తెలు ఎలా సురక్షితంగా ఉంటారు? అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాక్షులకు ఇచ్చిన భద్రతను ఇప్పటికే ఉపసంహరించుకున్నారని, తాజా తీర్పుతో తమ భయాలు మరింత పెరిగాయని ఆమె తెలిపారు. డబ్బున్నవారే గెలుస్తున్నారు, డబ్బులేనివారు ఓడిపోతున్నారు అంటూ న్యాయవ్యవస్థపై నిరాశ వ్యక్తం చేశారు.
ఇండియా గేట్ వద్ద నిరసన
తీర్పుకు నిరసనగా మండి హౌస్ వద్ద ఆందోళన చేసేందుకు తల్లి తో కలిసి బయల్దేరినట్లు ఆమె చెప్పారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మహిళా హక్కుల కార్యకర్త యోగిత భయానా బాధితురాలి తల్లితో కలిసి ఇండియా గేట్ వద్ద మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితురాలు తన న్యాయవాదిని కలవడానికి వెళ్తుండగా సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తనను వెనక్కి పంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నా లాయర్‌ని కలవాలి అని నేను అరుస్తూనే ఉన్నాను. చివరకు పై నుంచి ఆదేశాలు వచ్చి నన్ను లాయర్ దగ్గరకు తీసుకెళ్లారని ఆమె వీడియోలో పేర్కొన్నారు. నిరసన సమయంలో తోపులాటలో బాధితురాలికి గాయాలయ్యాయని యోగిత భయానా ఆరోపించారు. అయితే, పోలీసులు మాత్రం సాయంత్రం 8.45 గంటలకు నిరసనకారులను అక్కడి నుంచి సీఆర్‌పీఎఫ్ బస్సులో తరలించాం. అంతకుమించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.
నేరస్తులకు ధైర్యం
ఈ కేసు సహా అనుబంధ కేసులను 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఇదిలా ఉండగా, 2012 నిర్భయ అత్యాచార ఘటన బాధితురాలి తల్లి ఆశా దేవి, ఉన్నావో బాధితురాలికి మద్దతుగా నిలిచారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు దురదృష్టకరం అని వ్యాఖ్యానించిన ఆమె, ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని అన్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వడం నేరస్తులకు ధైర్యం ఇస్తుంది. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని ఆమె తెలిపారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థే కాదు..సమాజం కూడా చచ్చిపోతోంది: రాహుల్ గాంధీ
2017 ఉన్నావో అత్యాచార కేసులో మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ మంజూరు చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం నిరాశకరం, సిగ్గుచేటు అని విమర్శించిన ఆయన, బాధితురాలిని వ్యవస్థ ఇప్పటికీ ఎలా చూస్తోందో అన్నదానిపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. దేశం కేవలం మృత ఆర్థిక వ్యవస్థగా మారడమే కాదు, ఇలాంటి అమానుష ఘటనలతో మృత సమాజంగా కూడా మారుతోందని వ్యాఖ్యానించారు.
గ్యాంగ్‌రేప్ బాధితురాలి పట్ల ఇలా ప్రవర్తించడం సబబేనా? న్యాయం కోసం ధైర్యంగా గొంతు విప్పడమే ఆమె తప్పా? ఆమెపై దారుణానికి పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ ఇవ్వడం అత్యంత హేయం, సిగ్గుచేటు. బాధితురాలు భయంతో జీవిస్తూ, పదేపదే వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇది మరింత బాధాకరం అని ఎక్స్ లో పోస్టు చేశారు. అత్యాచార నిందితులకు బెయిల్, బాధితులను నేరస్తుల్లా చూడటం – ఇది ఏ రకమైన న్యాయం? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కూల్చివేస్తాయని హెచ్చరించారు.
ఇది కేవలం సంస్థాగత వైఫల్యమే కాదు, లోతైన నైతిక పతనానికి సూచికగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరం వినిపించడం హక్కు. దాన్ని అణిచివేయడం నేరం. బాధితురాలికి కావాల్సింది గౌరవం, భద్రత, న్యాయం – భయంతో నిండిన నిరాశ కాదని అన్నారు.
