
‘ఉన్నావో’ అత్యాచార కేసులో దోషికి బెయిల్
దేశవ్యాప్తంగా 2017లో సంచలనం రేపిన ఉన్నావో అత్యాచార కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. ఆయన జైలు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ, కఠిన నిబంధనలతో బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరిష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సెంగార్ రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు, అదే మొత్తానికి ముగ్గురు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. అలాగే బాధితురాలి నివాసానికి (ఢిల్లీ) ఐదు కిలోమీటర్ల పరిధిలోకి రావద్దని, ఆమెను లేదా ఆమె తల్లిని బెదిరించకూడదని స్పష్టంగా పేర్కొంది. కోర్టు విధించిన ఏ నిబంధనను ఉల్లంఘించినా బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. సెంగార్ తన దోష నిర్ధారణ, శిక్షపై దాఖలు చేసిన అప్పీల్ తుది విచారణ పూర్తయ్యే వరకు ఈ శిక్ష సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కోర్టు తెలిపింది. 2019 డిసెంబరులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టులో సవాలు చేశారు.
బెయిల్ షరతులలో భాగంగా
ముగ్గురు ష్యూరిటీలు ఢిల్లీ నివాసులే కావాలి. అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత కాలం సెంగార్ ఢిల్లీలోనే ఉండాలి. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో జమ చేయాలి.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి. అప్పీల్‌లో దోషిగా తేలితే మిగిలిన శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో సెంగార్ 2017లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 ఆగస్టు 1న ఈ కేసుతో పాటు అనుబంధ కేసులను ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. ఇదే కాకుండా, బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో సెంగార్‌కు విధించిన 10 సంవత్సరాల జైలు శిక్షపై కూడా ఆయన అప్పీల్ పెండింగ్‌లో ఉంది. ఆ కేసులోనూ తాను ఇప్పటికే గణనీయమైన కాలం జైల్లో గడిపినందున శిక్ష సస్పెన్షన్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
కేసు నేపథ్యం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను 2017లో అప్పటి అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో న్యాయం కోసం బాధితురాలు సీఎం నివాసం ముందు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించడంతో ఈ ఘటన జాతీయ స్థాయిలో దుమారం రేపింది.
కస్టడీలో మరణించిన బాధితురాలి తండ్రి
కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బాధితురాలి తండ్రిని అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నడన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉండగానే ఆయన మృతి చెందారు. ఈ ఘటనను కస్టడీ మరణంగా పరిగణించి మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో సెంగార్‌కు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
కారు ప్రమాదం, సాక్షుల మృతి
2019లో బాధితురాలు కోర్టు విచారణకు వెళ్తుండగా జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు మృతి చెందగా, ఆమె తీవ్రంగా గాయపడింది. సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నమని భావించిన కోర్టులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాయి.
సుప్రీంకోర్టు జోక్యం
న్యాయానికి భంగం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు 2019 ఆగస్టు 1న కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుతో పాటు అనుబంధ కేసులను ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయడంతో పాటు, సీబీఐకి దర్యాప్తు అప్పగించింది. రోజువారీ విచారణ జరపాలని ఆదేశించింది.
ట్రయల్ కోర్టు తీర్పు
2019 డిసెంబరులో ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అత్యాచార కేసులో కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం. కస్టడీ మరణం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో బీజేపీ పార్టీ సెంగార్‌ను బహిష్కరించింది.
