
ఉద్యోగ కోతలకు గురైన వారికి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వండి: కేంద్రానికి కవిత లేఖ
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో జరుగుతున్న భారీ తొలగింపుల నేపథ్యంలో, ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ సమయంలో లభించే 'సెవరెన్స్ ప్యాకేజీ' పై ఒకేసారి ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ఆ లేఖలో కవిత దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించినప్పటికీ, ఉద్యోగం కోల్పోయిన సమయంలో వారికి సరైన పన్ను ఉపశమనం లేకపోవడం అన్యాయమని అన్నారు. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 18(1)(a) ప్రకారం సెవరెన్స్ ప్యాకేజీలు ‘ప్రాఫిట్స్ ఇన్ ల్యూ ఆఫ్ సాలరీ’గా పరిగణించి, వాటిపై వర్తించే స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. కొత్త పన్ను విధానం కింద మినహాయింపులు తగ్గించిన నేపథ్యంలో, ఉద్యోగం కోల్పోయిన వారికి ఎటువంటి ఉపశమనం లభించడం లేదని కవిత అభిప్రాయపడ్డారు.
సెవరెన్స్ ప్యాకేజీలపై పన్ను విధించడం వల్ల నిరుద్యోగ సమయంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడాల్సిన మొత్తం గణనీయంగా తగ్గిపోతుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా ఒకేసారి మొత్తంగా చెల్లించే ప్యాకేజీలు వ్యక్తిని ఎక్కువ రేటు పన్ను వర్తించే ఆదాయ స్థాయిలోకి వెళ్లడం ప్రమాదం ఉందని, దీంతో వారికి లభించాల్సిన సహాయం మరింత తగ్గిపోతుందని వివరించారు. ఉద్యోగం కోల్పోయిన సమయంలోనే ఆదాయం తగ్గిపోతుండగా, అదే సమయంలో పన్నుల రూపంలో భారీ కోత విధించడం అన్యాయమని కవిత అన్నారు. ఇది ఉద్యోగులపై అదనపు భారం మోపుతూ, వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నచిన్న మార్పులు సరిపోవని, ఒక స్పష్టమైన, సమగ్ర నిర్ణయం అవసరమని కవిత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట కాలపరిమితి వరకు ఉద్యోగాల కోతకు గురైన వారికి సెవరెన్స్ ప్యాకేజీలపై పూర్తిస్థాయి, తాత్కాలిక పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ఈ చర్య ద్వారా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని, వారు కొత్త అవకాశాలు పొందే వరకు జీవన వ్యయాలను నిర్వహించుకోవడానికి ఇది సహాయపడుతుందని కవిత తన లేఖలో పేర్కొన్నారు.
