
ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలులో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, హెల్త్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి “కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా” ఉందన్నారు.
హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు జూలై 15 నుంచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలు విడుదల కాలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెట్‌వర్క్ ఆసుపత్రులతో సంతృప్తికరమైన ఒప్పందాలు కూడా కుదరలేదని ఆరోపించారు.
పథకం అమలు చేయకుండానే గత రెండు నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి 1.5 శాతం చొప్పున కోత విధిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అభయహస్తం మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలలు గడిచినా పీఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు, 6 డీఏల జాడ లేదు. సీపీఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదని అన్నారు. జూన్ 2 నుంచి హెల్త్ స్కీం అమలు చేస్తామని చెప్పి, తర్వాత జూలై 15కు వాయిదా వేసినా ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రెండు పీఆర్సీలు, 73 శాతం ఫిట్‌మెంట్ అందించామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎలాంటి అదనపు భారం లేకుండా వెల్‌నెస్ సెంటర్లు, ఇతర ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందించామని గుర్తు చేశారు.ఉద్యోగుల హెల్త్ స్కీంను మరింత బలోపేతం చేసేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
ప్రస్తుతం ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు వంటి హామీలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించిన హరీష్ రావు, హెల్త్ కార్డులను వెంటనే జారీ చేసి, పథకం అమలు కాకముందే కోత విధించిన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉన్నాయని విద్యా కమిషన్‌తో చెప్పించడం, రిటైర్డ్ ఇంజనీర్లను జైలుకు పంపుతానని బెదిరించడం రేవంత్ రెడ్డి పగబట్టే చర్యలకు నిదర్శనమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే వారి తరఫున బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.
