
ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట: డిప్యూటి సీఎం భట్టి
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తీరుస్తూనే, ఉద్యోగులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి రాష్ట్రంలో మొత్తం రూ. 40,154 కోట్ల విలువైన బిల్లులను పెండింగ్‌లో ఉంచిన విషయం శ్వేతపత్రం ద్వారా శాసనసభలో అధికారికంగా డిప్యూటి సీఎం గుర్తు చేశారు. ఈ పెండింగ్ బిల్లుల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయని, ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించిన బిల్లులు మాత్రమే రూ.4,575 కోట్ల మేర పెన్షనర్ల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని డిప్యూటి సీఎం తెలిపారు.
డిప్యూటి సీఎం మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. పెన్షనరీ బెనిఫిట్స్‌లో భాగంగా ఇప్పటివరకు రూ. 1,752 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు. ఇంకా చెల్లించాల్సిన పెన్షన్ బకాయిల మొత్తం రూ.6,244 కోట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
మిగిలిన పెన్షనరీ బెనిఫిట్స్ కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.700 కోట్లను విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు. పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల జీతాలను ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జీతాలు పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తూ, ఎస్పీడీసీఎల్, న్పీడీసీఎల్ పరిధిలో ప్రతి నెల 52 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తోందన్నారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు.
ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, త్వరలోనే ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మెడికల్ బిల్లుల విషయంలో ఇప్పటికే రూ.200 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, ఇకపై ఎవరూ మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, మెడికల్ బిల్లులు ఎప్పటికీ పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటి సీఎం పేర్కొన్నారు.
