Let's talk: editor@tmv.in
ఉద్యోగులే సంస్థల బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి వివేక్

ఉద్యోగులే సంస్థల బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి వివేక్

Dantu Vijaya Lakshmi Prasanna
27 ఫిబ్రవరి, 2026

ఏ సంస్థకైనా నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు ఉద్యోగులేనని, వారి సంతృప్తే ఉత్పాదకతను పెంచే ప్రధాన అంశమని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మానవ వనరుల విభాగం సంస్థల్లో ప్రగతిశీల విధానాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని హెచ్ఐసిసి నోవెటల్ లో అసోచామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో హెచ్‌ఆర్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉందని, పరిశ్రమ నాయకులతో మళ్లీ కలవడం సంతోషంగా ఉందని తెలిపారు.

గతంలో హెచ్‌ఆర్ విభాగాలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, ప్రస్తుతం అవి ఏ సంస్థకైనా అత్యంత కీలక విభాగాలుగా మారాయని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులను సమర్థంగా నిర్వహించడం, ప్రతిభావంతులను నిలుపుకోవడం, ఉత్పాదకతను పెంచడం హెచ్‌ఆర్ నిపుణులకు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని అన్నారు.

తాను గతంలో సిఐఐ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేస్తూ, అప్పట్లో వేతనాలు, కార్మిక సమస్యలు వంటి అనేక సవాళ్లు ఉండేవని, అయితే కాలక్రమంలో కార్మిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. తన తండ్రి కాకా వెంకటస్వామి కూడా కార్మిక మంత్రిగా సేవలందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై మాట్లాడుతూ, తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పాత ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన మానవ వనరులను నియమించుకోవాలని, కొత్త కోర్సులపై సూచనలు ఇవ్వాలని హెచ్‌ఆర్ నాయకులను మంత్రి ఆహ్వానించారు.