Let's talk: editor@tmv.in
ఉద్యోగులపై చర్యలు కోర్టుల ద్వారానే తీసుకోవాలి: ఒమర్ అబ్దుల్లా

ఉద్యోగులపై చర్యలు కోర్టుల ద్వారానే తీసుకోవాలి: ఒమర్ అబ్దుల్లా

Pinjari Chand
31 అక్టోబర్, 2025

ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైన ఇద్దరిని యువతను తీవ్రవాద దారిలోకి నెట్టడం, లష్కరేతోయిబాకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో తొలగించడంపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్​ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులపై చర్యలు కోర్టుల ద్వారానే జరగాలి. ప్రతి ఒక్కరికీ తమవంతు వివరణ చెప్పుకునే అవకాశం ఉండాలి. న్యాయపరమైన విచారణ లేకుండా తీసుకునే నిర్ణయాలు చివరికి అందరికీ హానికరమవుతాయని ఆయన అన్నారు. అనుమానాల ఆధారంగా ఉద్యోగాలు తొలగించడం సరైంది కాదు. నేరం నిరూపితమవ్వాల్సింది కోర్టుల ద్వారానే అని స్పష్టం చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందే. కానీ కేవలం ఆరోపణలు వచ్చాయని ఉద్యోగాల నుంచి తొలగించడం సరైంది కాదు.

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన పరిపాలన శాఖ గురువారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులో లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం ప్రకారం రాజౌరి జిల్లా ఖియోరాకు చెందిన మాజిద్ ఇక్బాల్ దార్ అనే ఉపాధ్యాయుడిని భద్రతా కారణాల దృష్ట్యా విచారణ అవసరం లేకుండా వెంటనే సేవల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది.

ఈ విషయంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్రంగా స్పందించారు. ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముస్లింలను, ముఖ్యంగా కశ్మీరీలను అణగదొక్కే ప్రయత్నమే ఇది. ఇలాంటి చర్యలు వివక్షతను పెంచుతున్నాయని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

జమ్మూ కశ్మీర్ నాయకుడు సురిందర్ చౌధరీ స్పందిస్తూ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారెవరికైనా, వారు ఏ మతానికి చెందిన వారైనా చర్య తప్పదు అని అన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులను పంపిన విషయమై ఒమర్ అబ్దుల్లా సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సమస్యలను రాజ్యసభలో బలంగా వినిపిస్తారని నాకు నమ్మకం ఉంది అని తెలిపారు. అదే రోజు ఆయన హండ్వారాలోని చినార్ పార్క్‌ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు.