
ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తున్న ఏఐ
ప్రపంచాన్ని ఓ భారీ అల భయపెడుతోంది. ఆ అల పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ అల ఒక్కసారి ఎగసి పడితే లక్షలాది మందికి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. టెక్నాలజీ కొత్త దారులు తెరుచుకుంటున్న వేళ.. అదే టెక్నాలజీ పాత ఉద్యోగాలను మూసేస్తోంది. ఒక వైపు కంపెనీలు వేగం కోసం, ఖర్చు తగ్గించుకోవడానికి, పనిలో ఖచ్చితత్వం కోసం AI వైపు పరుగులు పెడుతుంటే, మరోవైపు సాధారణ ఉద్యోగులు జాబ్స్ కోల్పోతూ భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇప్పటికే అక్సెంచర్ కంపెనీ మూడు నెలల్లో 11 వేల మంది ఉద్యోగులను బయటకు పంపింది. ఇదే తరహా పని గతంలో టీసీఎస్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా మూడో వంతు వరకు ఉద్యోగులను తగ్గించే దిశగా AI బాట్స్ వాడుతోంది. జర్మనీలో బోష్ కంపెనీ వచ్చే 5 సంవత్సరాల్లో 13 వేల ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలో ఉంది. ఇదంతా చూస్తే ఓ విషయం అర్థమవుతుంది.. ఉద్యోగాలపై కొత్త యుద్ధం మొదలైందని తెలుస్తోంది. ఆ యుద్ధానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఇటు కంపెనీలు ఒకే మాట చెబుతున్నాయి. వేగం కావాలి, ఖర్చు తగ్గాలి, ఖచ్చితత్వం పెరగాలి. ఈ మూడు కోరికలకు సమాధానం AI రూపంలో కనిపిస్తోంది. కేవలం సాఫ్ట్‌వేర్ రాయడం మాత్రమే కాదు, డేటా ప్రాసెస్ లాంటి పనులు కూడా AI చేతుల్లోకి వెళ్లిపోతోంది. మనిషి చేతులు కొద్దికొద్దిగా వెనక్కు వెళ్లిపోతున్నాయి. ఒకప్పుడు 100మంది చేసే పనిని ఇప్పుడు కొన్ని కోడ్‌లతో పూర్తి చేస్తున్నారు. ఈ మార్పు మెల్లిగా కాదు, వేగంగా దూసుకెళ్తోంది. ఇటు భారత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రపంచానికి ఐటి శక్తి కేంద్రంగా పేరుగాంచిన ఇండియాలో.. లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన రంగమే ఇప్పుడు భయానకంగా మారుతోంది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల వరకు ఉద్యోగాలు మాయం కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. కానీ ఈ మార్పు ఎదుర్కొనే శక్తి కార్మికుల చేతిలో లేదు. యూనియన్లకు హక్కులు లేని రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్న చోట్ల కూడా కంపెనీల ఒత్తిడి, లాబీల అడ్డంకులు, భయపెట్టే వాతావరణం. ఇలా ఉద్యోగులు ఒంటరి అవుతున్నారు. ఒకప్పుడు కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఐటి ఉద్యోగం ఇప్పుడు క్షణాల్లో మాయమైపోతుందనే భయం వారిని వెంటాడుతోంది.
ఇక ఇండియాలో AI నిపుణుల కొరత ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర చదువులు వేరు, మార్కెట్‌కి కావాల్సిన నైపుణ్యాలు వేరు. ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదివినా, కొత్త టెక్నాలజీలు అర్థం చేసుకునే నైపుణ్యాన్ని కలిగి లేరు. AI నేర్చుకోవడానికి సరైన అవగాహన చాలామందికి లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒకటే సమాధానం.. అదే AI నేర్చుకోవడం! ఇప్పుడు కేవలం కోడింగ్ కాదు.. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ మోడల్స్ గురించి తెలుసువాల్సిందే. ఫ్రీ కోర్సులతో అయినా నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఇంటర్నేషనల్ సెర్టిఫికేషన్స్ తీసుకుంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పొందగలుగుతారు. కంపెనీలు కూడా అప్-స్కిల్లింగ్ పై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కొత్త ఏఐ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే చైనా, అమెరికా, యూరప్ ఏఐలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం వెనుకబడితే ఈ ఉద్యోగాలు మనదేశం నుంచీ పోతాయి! కాబట్టి.. ఇంకా ఆలస్యం చేయకుండా, వెంటనే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఏఐ మీ ఉద్యోగ భద్రతను కాపాడుతుంది! లేదంటే అంతే సంగతి!
