
ఉద్యమానికి ఎదురు దెబ్బ.. మావోయిస్టు అగ్రనేత 'దేవ్‌జీ' పోలీసులకు లొంగుబాటు
మావోయిస్ట్ ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థలో అత్యంత కీలకమైన వ్యూహకర్త, అగ్రశ్రేణి కమాండర్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) ఆదివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన దేవ్‌జీ లొంగిపోవడం, నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్ట్ పార్టీకి చావుదెబ్బ వంటిదని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అగ్రశ్రేణి మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్)తో పాటు సుమారు 16 మంది కేడర్ మావోయిస్టులు కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల ముందు వీరు లొంగినట్లు సమాచారం. ఈ పరిణామం సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంయుక్త ఆపరేషన్ల నేపథ్యంలో చోటుచేసుకుంది.
దేవ్‌జీ ప్రస్థానం - గెరిల్లా పోరాటం
జగిత్యాల జిల్లా వాసి అయిన దేవ్‌జీ (62) మే 2025లో మరణించిన సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు తర్వాత ఆ బాధ్యతలు చేపట్టినట్లు భావిస్తున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి, పలువురు కేడర్లు కూడా లొంగిపోయినట్లు సమాచారం.
రూ. 1 కోటి రివార్డు కలిగిన దేవ్‌జీ, మావోయిస్ట్ పార్టీలో అత్యంత ప్రభావితమైన నాయకుడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ని స్థాపించడంలో ఈయనది కీలక పాత్ర. అనంతరం సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర సైనిక కమిషన్ (సీఎంసీ) ఇన్‌చార్జిగా పనిచేస్తూ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మాడ్ ప్రాంతం నుంచి కార్యకలాపాలు నిర్వహించినట్లు సమాచారం.
1982లో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో దేవ్‌జీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) వైపు ఆకర్షితుడయ్యారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లాలో ఆర్‌ఎస్‌యూ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, ఆ కేసులో దేవ్‌జీ నిందితుడిగా ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.
1983లో సీపీఐ ఎంఎల్ (పీపుల్స్ వార్ గ్రూప్)లో చేరిన ఆయన అండర్‌గ్రౌండ్ జీవితం ప్రారంభించారు. 1983-84 మధ్య గడ్చిరోలి దళంలో సభ్యుడిగా పనిచేసి, 1985లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2016లో కేంద్ర సైనిక కమిషన్ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం.
పార్టీలో చీలిక - మారిన ఆలోచనలు
మావోయిస్ట్ పార్టీలో గత కొంతకాలంగా సాయుధ పోరాటం కొనసాగించాలా వద్దా అనే అంశంపై తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 అక్టోబర్‌లో మహారాష్ట్ర గడ్చిరోలిలో 60 మంది కేడర్లతో కలిసి లొంగిపోయిన తెలంగాణకు చెందిన మరో కీలక వ్యూహకర్త మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, తాత్కాలికంగా సాయుధ పోరాటాన్ని విరమించాలి అంటూ కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ అభిప్రాయానికి దేవ్‌జీ సహా మరికొందరు సీనియర్ నేతలు వ్యతిరేకంగా నిలిచినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మావోయిస్టు శ్రేణుల్లో ఈ విధమైన విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. కానీ, నేడు దేవ్‌జీ స్వయంగా లొంగిపోవడం పార్టీలోని అంతర్గత బలహీనతను ప్రతిబింబిస్తోంది.
ఆపరేషన్ 'కేజీహెచ్ 2' గడువు
ఇదిలా ఉండగా, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు ‘కేజీహెచ్-2’ పేరుతో విస్తృత ఆపరేషన్‌ను ఫిబ్రవరి 17న ప్రారంభించాయి. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని నాంబి, కర్రెగుట్ట కొండలు ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మిసిర్ బెస్రా అలియాస్ భాస్కర్, దేవ్‌జీ, రమ్మన్న అలియాస్ గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు, రాజిరెడ్డి వంటి నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు సహా సుమారు 300 మంది నక్సల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మార్చి 2026ను గడువుగా నిర్ణయించిన నేపథ్యంలో ఈ లొంగుబాటు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా రెండు రోజుల్లో అధికారికంగా లొంగుబాటు వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం వారు తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉన్నారు అని ఉన్నతాధికారి తెలిపారు.
తెలంగాణ డీజీపీ పిలుపు
మార్చి 2026 గడువును దృష్టిలో ఉంచుకుని మిగిలిన నేతలు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఫిబ్రవరి 15న తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి, అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేతలు, తెలంగాణకు చెందిన సుమారు 15 మంది మిగిలిన నాయకులు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో చేరితే ప్రభుత్వం నుంచి "పునరావాస పథకం" కింద పూర్తి ఆర్థిక సాయం, రక్షణ అందిస్తామని తెలిపారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 588 మంది మావోయిస్ట్ నేతలు, సభ్యులు లొంగిపోయి కేడర్లు సాధారణ జీవితం గడుపుతున్నారని డీజీపీ వెల్లడించారు. తాజాగా దేవ్‌జీ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవిష్యత్తుపై కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
