Let's talk: editor@tmv.in
ఉద్యమకారుల గుర్తింపులో కీలక దశ.. కార్మిక సంఘాలతో కమిటీ ముఖాముఖి

ఉద్యమకారుల గుర్తింపులో కీలక దశ.. కార్మిక సంఘాలతో కమిటీ ముఖాముఖి

Gaddamidi Naveen
11 జులై, 2026

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) మొదటి అంతస్తులో జరుగుతున్న ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియ శుక్ర‌వారం అత్యంత కీలక దశకు చేరుకుంది. జూలై 6న ప్రారంభమైన ఈ ప్రత్యేక సమీక్షా విండోలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, అసంఘటిత రంగ కార్మిక శ్రేణులు కమిటీని కలిసి తమ వినతులను సమర్పించారు.

ఈ ముఖాముఖి సమీక్షా సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ హాజరై ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు.

ఉద్యమానికి కార్మిక సంఘాలే వెన్నుముక

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో కార్మిక సంఘాల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ సాధనలో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత చారిత్రాత్మకమైనదని ప్యానల్ ముక్తకంఠంతో కొనియాడింది. నాడు ఆర్టీసీ, సింగరేణి, రైల్వే, బిఎస్ఎన్ఎల్ టిజెఏసి ఉద్యోగులతో పాటు అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి, 'సకల జనుల సమ్మె' ద్వారా యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేయడం వల్లే నాటి ఢిల్లీ పీఠం దిగివచ్చిందని కమిటీ గుర్తుచేసింది. కార్మిక లోకం అందించిన ఆ ఊపు లేకపోతే తెలంగాణ కల సాకారం అయ్యేది కాదని స్పష్టం చేశారు.

సమావేశానికి హాజరైన 1969 తెలంగాణ ఉద్యమకారులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు తమకు అధికారిక గుర్తింపు కల్పించాలని కోరారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మిక యోధుడికి ప్రభుత్వ ప్రశంసాపత్రాలు అందించాలని, అర్హులైన కుటుంబాలకు 250 గజాల నివాస స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యమకారులు, వారి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించే ప్రత్యేక హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, వృద్ధాప్యంలో ఉన్న వారికి గౌరవ పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఉచిత రవాణా సదుపాయం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.

కమిటీ సభ్యులు స్పందిస్తూ కార్మికులు కోరుతున్న సంక్షేమ ప్రయోజనాలు ప్రభుత్వ భిక్ష కాదని, ఉద్యమంలో చేసిన త్యాగాలకు గుర్తింపుగా లభించాల్సిన హక్కులని పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డిజిటల్ రికార్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి నిజమైన ఉద్యమకారుడి వివరాలను నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. జూలై 22న సంప్రదింపుల షెడ్యూల్ ముగిసిన అనంతరం సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సమర్పించి అర్హులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు తెలిపారు.

ట్యాగ్‌లు
TelanganaTelanganaMovementTradeUnionsWorkersRightsTelanganaMartyrsAmaraveerulaSmruthiKCRMemorialTelanganaHistoryWorkersMovement
ఉద్యమకారుల గుర్తింపులో కీలక దశ.. కార్మిక సంఘాలతో కమిటీ ముఖాముఖి - Tholi Paluku