
ఉద్దానం.. కార్గో ఎయిర్‌పోర్ట్‌కి సెంటు భూమి కూడా ఇవ్వం
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్‌పోర్ట్‌కు అక్కడి ప్రజలు అడ్డం తిరిగారు. ఈ నెల 5వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెంనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన సమావేశానికి తాము హాజరు కావడం లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు రాంపురం సచివాలయ అధికారికి రైతులు మెమోరాండం కూడా ఇచ్చారు.
తరతరాలుగా ఉద్దానం ప్రాంతం జీడి తోటలకు ప్రసిద్ధి. పచ్చటి తోటల స్థానంలో కార్గో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతాంగం తమ భూముల్ని విడిచిపెట్టుకొని ఊరి వదిలి వెళ్ళిపోడానికి సిద్ధంగా లేరు. ఏడేళ్ళ క్రితం తిత్లీ తుఫాను వల్ల ఈ ప్రాంతంలోని జీడి చెట్లన్నీ మాడి మసైపోయాయి. తరువాత అప్పలు చేసుకొని తిరిగి కాపు మొక్కలు వేసుకున్నారు. ఆరేళ్ళ తరువాత ఇప్పుడు కాపు కొచ్చి పంట చేతికి అందుకుతుందనగా టీడీపీ ప్రభుత్వం కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో తమ భూముల్ని బలవంతంగా లాగేసుకోడానికి సిద్ధమైందని ఇక్కడి రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రైతుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెంనాయుడు, గౌతు శిరీషా ఏకపక్షంగా రైతుల గుండెల మీద గుద్దేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి పన్నాగాలకు సాగనీకూడదని రైతాంగం ఒక్క మాట మీద నిలబడడం విశేషం.
బాధిత రైతులు రాంపురం సచివాలయానికి అందించిన మెమోరాండం పూర్తి పాఠం ఇది. "కార్గో ఎయిర్‌పోర్ట్‌కి ఒక సెంటు భూమి కూడా ఇవ్వమని అనేక సార్లు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రత్యక్షంగా తెలియపరిచాం. మన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధిత రైతు గ్రామాల్లో ఇలాంటి సమావేశం ఏర్పాటు చెయ్యకుండా సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పలాస రైల్వే ఇన్స్టిట్యూట్‌లో ఏర్పాటు చేయడం అనేది సరైన పద్ధతేనా?
ఇలాంటి సమావేశాలు మునుపెన్నడూ ఎక్కడా ఎప్పుడు జరగలేదు. ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పుడు దాని వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు, లాభాల గురించి ప్రభావిత గ్రామాలలో సమావేశాలు నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. స్థానిక రైతులలో మెజారిటీ రైతాంగం వద్దన్నప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదు. సామాజిక ప్రభావిత బాధితులు కూడా ఉంటారు. భూమిలేని నిరుపేద కూలీలు ఉంటారు. వృత్తిదారులు ఉంటారు. వీరందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి సమావేశాలు చెయ్యడం సరైనది కాదు. కనీసం 2013 చట్టం ఏం చెప్తుందో అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియదా? ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పేరుతో పచ్చని మా ఉద్దానం గ్రామాలను, మా పంటలను విధ్వంసం చేయవద్దని, పచ్చని మా పల్లెలను నాశనం చేయొద్దని, మా పంట భూములను కాపాడాలని గత 11 నెలలుగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా నిరసన వ్యక్తపరుస్తున్నాము. కనీసం మా పోరాట కమిటీని కూడా గుర్తించకుండా ఏకపక్షంగా ముందుకు సాగడం తగదని గుర్తు చేస్తున్నాము. అలాగే పలాస రైల్వే ఇన్స్టిట్యూట్‌లో మీరు పెట్టే సమావేశానికి అర్ధం లేదు. ఎయిర్పోర్ట్‌పై మా అభిప్రాయాలు తెలుసుకోవాలంటే నాలుగు పంచాయతీ పరిధిలో సుమారు 20 గ్రామాల రైతాంగం ఈ పరిధిలో ఉన్నారు. ముఖ్యంగా రాంపురం, గంగువాడ, బిడిమి పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే ఇక్కడ మెజార్టీ రైతులు అభిప్రాయాలు మీకు తెలిసేవి. అలా కాకుండా సమాజాన్ని పక్కదారి పట్టించే తప్పుడు సందేశం ఇవ్వడానికి కాశీబుగ్గలో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. బాధిత గ్రామాల్లో నిర్వహించలేని ఈ సమావేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం. మరోసారి ఈ లేఖ ద్వారా కార్గో ఎయిర్ పోర్ట్ ఒక్క సెంటు భూము కూడా మేము ఇవ్వమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
