Let's talk: editor@tmv.in
ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటాం: కవిత

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటాం: కవిత

Gaddamidi Naveen
29 అక్టోబర్, 2025

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఉద్దండపూర్ రిజర్వాయర్ ప్రాంతాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సందర్శించారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో భాగమైన ఈ రిజర్వాయర్ కారణంగా భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు తగిన పరిహారం అందించాలంటూ ప్రభుత్వాన్ని కవిత కోరారు.

పరిహారంపై కవిత డిమాండ్లు

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉద్దండపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో ఆ రోజుని ఆధారంగా రేటు కట్టి ఇవ్వాలన్నారు. 2021 సంవత్సరాన్ని కటాఫ్‌గా పెట్టడం అన్యాయం. పరిహారం ఇచ్చే నాటికి 18 ఏళ్లు నిండిన వారందరికీ హక్కు కల్పించాలని క‌విత డిమాండ్ చేశారు.

ప్రాజెక్టు పూర్తిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవిత

ప్రాజెక్టు పనుల ఆలస్యంపై ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి కరువు తీవ్రంగా ఉండేదని, వందల ఎకరాలు ఉన్న వారు కూడా నీళ్లు లేక వలస పోయారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో నీటి సౌలభ్యాన్ని మెరుగుపరుచుకున్నామని, ఎండకాలంలో కూడా చెరువులు కళకళలాడేవని ఆమె అన్నారు.

కృష్ణా నది నీటిని సక్రమంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ సహా ఈ ప్రాజెక్టులో 80 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని ఆమె వివరించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులను పూర్తి చేయటం లేదన్నారు. తప్పు బీఆర్‌ఎస్ దా, కాంగ్రెస్ దా అని కాదు. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు అని కవిత పేర్కొన్నారు. అలాగే రెండు వందల ఎకరాలకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయనే కారణంతో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని ప్రజలకు మంచి జరగాలని మిగతా 20 శాతం పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడానికి పెద్ద మనసు చేసుకున్న నిర్వాసితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం పొందే వరకు తెలంగాణ జాగృతి రైతుల పక్కన నిలుస్తుందని కవిత తెలిపారు.

ఉద్దండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు అండగా ఉంటాం: కవిత - Tholi Paluku