Let's talk: editor@tmv.in
ఉద్యోగిని ఆత్మహత్య.. కంపెనీకి రూ.9 కోట్ల జరిమానా!

ఉద్యోగిని ఆత్మహత్య.. కంపెనీకి రూ.9 కోట్ల జరిమానా!

Venkatesh Balusula
16 సెప్టెంబర్, 2025

జపాన్ రాజధాని టోక్యోలో దారుణం జరిగింది. ఓ కంపెనీ వేధింపులను తట్టుకోలేక ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సదరు కంపెనీకి షాకిచ్చింది. బాధితురాలి కుటుంబానికి అక్షరాల రూ.9 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. కంపెనీ అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జపాన్లో ఆ తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవమానంతో మానసిక సమస్యలు

సతోమి అనే యువతి 2021 ఏప్రిల్లో టోక్యోలోని డీ అప్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించింది. అదే ఏడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు సకాయ్ మిత్సురు సతోమిని తీవ్రంగా మందలించారు. ఆమెను ‘తిరుగుడు కుక్క’ అని పిలిచి, ‘పెద్దలతో గొడవ పెట్టుకోవద్దు’ అని హెచ్చరించారు. ఈ సంఘటన సతోమిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తరచూ ఈ అవమానం గురించి ఆలోచిస్తూ ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో సతోమికి 2022 జనవరిలో డిప్రెషన్ నిర్ధారణ అయింది. అనంతరం ఆమె ఆఫీసుకు సెలవు తీసుకుంది. ఇంటి వద్ద ఉన్నా కూడా తరచూ ఇవే ఆలోచనలతో సతమతమైంది. 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేసి కోమాలోకి వెళ్లింది. 2023 అక్టోబర్లో 25 ఏళ్ల వయసులో ఆమె మరణించింది.

సతోమి తల్లిదండ్రులు 2023 జూలైలో నష్ట పరిహారం కోసం కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టులో పలు వాయిదాల అనంతరం తాజాగా తుది తీర్పు వెలువడింది. కంపెనీ తక్షణమే బాధితురాలి కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వడంతో పాటు, కంపెనీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సతోమి సోదరి మాట్లాడుతూ తన సోదరి పని పట్ల ఎంతో అంకితభావంతో ఉండే వ్యక్తి అని, ఆమె బతికున్నప్పుడు అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని కోరిందని, సతోమికి జరిగినట్లు ఎవరికీ జరగొద్దని చెప్పారు.

ఈ తీర్పు అనంతరం సదరు కంపెనీ తన వెబ్సైట్లో ప్రకటన విడుదల చేసి మృతురాలి కుటుంబానికి క్షమాపణలు తెలిపింది. అధ్యక్షుడు సకాయ్ మిత్సురు బుధవారం రాజీనామా చేశారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వేధింపుల నివారణ నిబంధనలను సమీక్షించడం, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపడతామని తెలిపింది. పని ప్రదేశంలో ఉద్యోగులపై ఒత్తిడి చేసే సంస్థలకు జపాన్ కోర్టు తీర్పు ఒక హెచ్చరికగా మారింది.

ఉద్యోగిని ఆత్మహత్య.. కంపెనీకి రూ.9 కోట్ల జరిమానా! - Tholi Paluku