Let's talk: editor@tmv.in
ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు: పవన్ కళ్యాణ్

ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు: పవన్ కళ్యాణ్

Panthagani Anusha
14 డిసెంబర్, 2025

ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం ఎంత ముఖ్యమో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని విన్నవించగా ఆమె కోరిన వెంటనే ఆ రోడ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయించారు. వినతి అందిన కొద్ది గంటల్లోనే రూ. 6.2 కోట్ల విలువైన రోడ్లకు అనుమతులు రావడం విశేషం.

శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో అంధ మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక మాట్లాడుతూ తమ స్వగ్రామమైన తంబలహెట్టికి సరైన రహదారి సౌకర్యం లేదని, రోడ్డు వేయించి తమ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ కోరగా దీపిక విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి ఆ రోడ్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెంటనే కదిలింది. మడకశిర నియోజకవర్గం, అమరాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను అధికారులు పరిశీలించారు.

ఆ మేరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంచనా నివేదికను రూపొందించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు అదేవిదంగా గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని లెక్క తేల్చారు.

కాగా మధ్యాహ్నం కోరిన ఈ రెండు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన రూ.6.2 కోట్ల అంచనాలకు అనుమతులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అదే రోజు సాయంత్రానికి పాలనాపరమైన అనుమతులను జారీ చేశారు.

దీంతో ప్రపంచ వేదికపై దేశ కీర్తిని ఇనుమడింపజేసిన క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిక, ఆమె విన్నవించిన కొద్ది గంటల్లోనే నెరవేరింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రి చూపిన ఈ వేగం అంధుల క్రికెట్ జట్టుకు ఆయన ఇచ్చిన గౌరవంగా నిలిచింది.

ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు: పవన్ కళ్యాణ్ - Tholi Paluku