Let's talk: editor@tmv.in
ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్–2026

ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్–2026

Dantu Vijaya Lakshmi Prasanna
26 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలు-2026 ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు జ్యోతి ప్రజ్వలన, స్పోర్ట్స్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్, అసెంబ్లీ ఫ్లాగ్‌ల ఆవిష్కరణలతో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ క్రీడా ఉత్సవాలు ప్రజాప్రతినిధుల్లో స్నేహభావం, ఐక్యతను మరింత బలపరచనున్నాయి.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఈ వేదిక పూర్తిగా క్రీడల కోసమేనని, రాజకీయాలకు ఎలాంటి తావు లేదని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల సమస్యలు, సభలతో ఒత్తిడిలో ఉండే ప్రజాప్రతినిధులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని తెలిపారు. 1983లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రజాప్రతినిధుల కోసం క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత అసెంబ్లీలో సుమారు 78 శాతం యువ ఎమ్మెల్యేలు ఉండటం ఈ పోటీలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు.

తన చిన్నతనంలో వాలీబాల్ ఆడిన రోజులను స్పీకర్ గుర్తు చేసుకుంటూ, ఎన్టీఆర్ తన ఆటను చూసి రాజకీయాల్లోకి ఆహ్వానించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. క్రీడల ముగింపు రోజున ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ, మధ్యలో నిలిచిపోయిన ఈ క్రీడా సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. రాజకీయ కార్యకలాపాల వల్ల కలిగే పని ఒత్తిడిని దూరం చేయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పార్టీలు, వ్యక్తుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను మర్చిపోయి అందరూ కలిసి మెలిసి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయన్నారు. గ్రామీణ క్రీడలను, పాఠశాల స్థాయిలో క్రీడల ప్రాధాన్యతను మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కంటే ఈసారి పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ పోటీల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా శాప్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్‌లు, తదితర అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ క్రీడా ఉత్సవాలు ప్రేరణగా నిలవనున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు.