
ఉత్తర తెలంగాణకు సాగు జలాల కళ: రెండు ప్రధాన బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
ఉత్తర తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో శుక్రవారం కీలక అధ్యాయం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులకు సాగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పిస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెండు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి భరోసా కలగనుందని ముఖ్యమంత్రి తెలిపారు.
అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో నిర్మించిన సదర్మట్ బ్యారేజీని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. యాసంగి పంటకు నీటిని విడుదల చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. సాగునీరు పొలాలకు చేరుతుండటాన్ని చూసిన రైతులు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమమే లక్ష్యమని, రైతు క్షేత్రాలు సస్యశ్యామలంగా మారడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. నదుల నుంచి మడులకు నీటిని మళ్లించి, ప్రతి ఎకరం సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీ పనులను వేగంగా పూర్తి చేసి శుక్రవారం తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు.
యాసంగి పంటకు నీటిని విడుదల చేయడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపించిందని, అదే తమ ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ జి. నగేష్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిగా వినియోగంలోకి రావడంతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ హయాంలో చేపట్టిన రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకం: కేటీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రారంభమై, 90శాతం పైగా పనులు పూర్తయిన రెండు ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు శుక్రవారం అధికారికంగా ప్రారంభం కావడం సంతోషదాయకం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సమస్యలను దూరం చేసి, ప్రాంతీయ పంటల ఉత్పత్తిని పెంచే ప్రధాన లక్ష్యంతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టులు తెలంగాణలో సాగు విప్లవానికి కొత్త దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు.
చనాక - కొరాటా బ్యారేజీ
ఈ రెండు ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభ సందర్బంగా కేటీఆర్ తన ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు.బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభమైన చనాక - కొరాటా బ్యారేజీ, 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఏర్పాటు చేయబడింది. సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌లో 95 శాతం పనులు పూర్తయాయి.బ్యారేజీ తో పాటు ఏర్పాటుచేసిన లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందించడం సులభమైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చి ప్రారంభించబడిందని కేటీఆర్ గుర్తు చేశారు.
సదర్మట్ బ్యారేజీ
నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సదర్మట్ బ్యారేజీ 1.58 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపొందించబడింది. కేసీఆర్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యి, ప్రాజెక్ట్‌ను పూర్తి దశకు చేరుస్తూ స్థానిక రైతుల జీవితాల్లో కొత్త ఆశను నింపుతోందని ఆయన పేర్కొన్నారు.
2014 నుంచి 2023 కాలంలో కేసీఆర్ పాలన, తెలంగాణ నెర్రెలు, పల్లెలను పునరుద్ధరించి, ఈ భూభాగాలను దేశానికి ధాన్యాగారంగా మార్చే ప్రయత్నంలో ప్రధాన భూమిక పోషించింది. చనాక - కొరాటా, సదర్మట్ బ్యారేజీలు రైతుల కోసం నీటి సమస్యలను తగ్గించడంలో, పంటల ఉత్పత్తి పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయని కేటీఆర్ తెలిపారు.
