Let's talk: editor@tmv.in
ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి పోటీకి విజయ్ సిద్ధం: టీవీకే

ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి పోటీకి విజయ్ సిద్ధం: టీవీకే

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున వెల్లడించారు. ఆదివారం చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మా నాయకుడు విజయ్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లి నేరుగా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే ప్రజా సమావేశాల నిర్వహణలో పోలీసుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీస్ )పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత బాధ్యత కేవలం పార్టీ నిర్వాహకులదే కాకుండా, ఆయా జిల్లాల్లో ఉన్న పోలీసులదీ అని పేర్కొన్నారు.

డీఎంకేను 5 స్థానాలు కోరిన ఐయూఎంఎల్

రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) డీఎంకేతో సీట్ల పంపకం కోసం చర్చలు ప్రారంభించింది. ఐయూఎంఎల్ అధ్యక్షుడు కే.ఎం ఖాదర్ మోహీయుద్దీన్ ఆదివారం డీఎంకే ప్రతినిధులను కలిసి తమ పార్టీకి ఐదు స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఐయూఎంఎల్ తరఫున డీఎంకే నాయకులను కలసి ఐదు స్థానాలు ఇవ్వాలని కోరామని ఖాదర్ మొహియుద్దీన్ మీడియాతో తెలిపారు.

డీఎంకేలో సీటు పంచాయితీ చర్చలు

డీఎంకే సీటు పంచాయితీ చర్చల కమిటీ మిత్రపక్షాలతో సమావేశమైంది. ఈ సమావేశానికి టి.ఆర్. బాలు, కె.ఎన్. నెహ్రూ, ఈ.వి. వేలు, తిరుచ్చి శివ, ఆర్.ఎస్. భారతీ, ఎం.ఆర్.కే. పన్నీర్‌సెల్వం తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. కమిటీ సభ్యులు ముందుగా ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలసి ఆపై పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపారు.

ఎన్టీకే పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల

ఇదిలా ఉండగా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) 234 మంది అభ్యర్థుల పూర్తి జాబితాను తిరుచిరాపల్లి జిల్లా అలంపట్టి పుదూరులో నిర్వహించిన సమావేశంలో విడుదల చేసింది. పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమన్ వేదికపై అభ్యర్థులందరినీ పరిచయం చేసి, తాను కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ ప్రకారం 117 మంది పురుషులు, 117 మంది మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. ఇది రాజకీయాల్లో లింగ సమానత్వానికి నిదర్శమని నేతలు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి 2026 త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2021 ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమి 151 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) కూటమిలోకి దేశీయ మురుపొక్కు ద్రావిడ కజగం (డీఎండీకే) చేరడం కీలక పరిణామంగా మారింది. ఇదిలా ఉండగా ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏలో బీజేపీ సహా ఇతర పార్టీలు అధికార డీఎంకే–కాంగ్రెస్ కూటమిని ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంతో ఈసారి తమిళనాడులో ముక్కోణపు పోటీ నెలకొననున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి పోటీకి విజయ్ సిద్ధం: టీవీకే - Tholi Paluku