Let's talk: editor@tmv.in
ఉత్తర కొరియా వారసురాలిగా కిమ్ కుమార్తె!

ఉత్తర కొరియా వారసురాలిగా కిమ్ కుమార్తె!

Shaik Mohammad Shaffee
13 ఫిబ్రవరి, 2026

కమ్యూనిస్టు కోట ఉత్తర కొరియాలో వారసత్వ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆ దేశ ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె 'కిమ్ జు ఆయే'ను తన రాజకీయ వారసురాలిగా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నిఘా సంస్థ (ఎన్ఐఎస్) స్పష్టం చేసింది. ఇప్పటివరకు కేవలం తండ్రి వెంటే ఉండే చిన్నారిగా కనిపించిన ఆమె, ఇప్పుడు దేశానికి కాబోయే నాయకురాలిగా ఎదుగుతోంది. కిమ్ తర్వాత దేశంలో ఆమెనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చలామణి అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి.

శిక్షణ దశ దాటి.. నాయకురాలి స్థాయికి!

2022లో తండ్రి చేయి పట్టుకుని తొలిసారి ఒక క్షిపణి పరీక్ష వద్ద కనిపించిన జు ఆయే, ఇప్పుడు తదుపరి నాయకురాలిగా ఎదుగుతోంది. గతంలో తండ్రి వెనుక నడిచిన ఆమె, ఇప్పుడు ఆయనకు సమానంగా సైనిక కవాతులు, ఆయుధ పరీక్షల్లో పాల్గొంటూ ఫోటోలకు ఫోజులిస్తోంది. కేవలం శిక్షణ పొందే దశను దాటి, ఇప్పుడు దేశానికి కాబోయే అధికారిక వారసురాలి స్థాయికి ఆమె చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.

తండ్రికి తగ్గ తనయగా.. విధాన నిర్ణయాల్లో జోక్యం

ఉత్తర కొరియా రాజకీయాల్లో జు ఆయే కేవలం అతిథిగా కాకుండా, ప్రభుత్వ నిర్ణయాల్లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఆ దేశ నిబంధనల ప్రకారం ప్రభుత్వ మీడియా ఫోటోల్లో ఒక వ్యక్తిని అధినేతతో సమానంగా చూపడమంటే, వారికి అత్యున్నత పదవి ఇచ్చినట్లే. ప్రస్తుతం కేవలం 13 ఏళ్ల వయసులోనే దేశ విధానాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, కిమ్ తర్వాత రెండో అత్యున్నత నాయకురాలిగా ఆమె ఎదుగుతోంది.

కుటుంబ సమాధుల సందర్శనతో సంకేతం

గత నెలలో న్యూ ఇయర్ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ తన సతీమణి, కుమార్తెతో కలిసి 'కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్'ను సందర్శించారు. అక్కడ కిమ్ పూర్వీకుల పార్థివ దేహాలను భద్రపరిచారు. మూడేళ్ల విరామం తర్వాత కిమ్ ఆ ప్రాంతానికి వెళ్లడం, అది కూడా తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వారా తన తాత, తండ్రి సాక్షిగా వారసురాలిని ప్రకటించినట్లు అవుతుందని కొరియా వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తొలి విదేశీ పర్యటనతో అంతర్జాతీయ గుర్తింపు

గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ తన కుమార్తెను చైనా రాజధాని బీజింగ్‌కు తీసుకెళ్లారు. అది ఆమెకు తొలి విదేశీ పర్యటన. అక్కడ ఆమెకు ఒక దేశాధినేతకు ఇచ్చే స్థాయి గౌరవం లభించింది. చైనా అధ్యక్షుడి సమక్షంలో జరిగిన మిలిటరీ పరేడ్‌లో ఆమె పాల్గొనడం ద్వారా, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమెను భవిష్యత్తు నేతగా కిమ్ పరిచయం చేశారు.

పితృస్వామ్య వ్యవస్థలో పెను మార్పు!

ఉత్తర కొరియా 1948లో ఏర్పడినప్పటి నుంచి కిమ్ వంశంలోని మగవారే దేశాన్ని ఏలుతున్నారు. ఆ దేశ సంస్కృతి అత్యంత సంప్రదాయబద్ధంగా, మగవారికి ప్రాధాన్యతనిచ్చేదిగా ఉంటుంది. మూడు తరాలుగా ఆ దేశాన్ని పురుషులే ఏలుతున్నారు. కిమ్‌కు కుమారుడు ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నా, ఆయనను పక్కన పెట్టి కుమార్తెను ముందుకు తేవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ జు ఆయే బాధ్యతలు చేపడితే, కిమ్ వంశంలో ఆ దేశాన్ని పాలించే తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.

ప్రజల కంటే భిన్నమైన జీవనశైలి

ఉత్తర కొరియాలో సామాన్య ప్రజలకు కఠినమైన ఆంక్షలు ఉంటాయి. కానీ జు ఆయే మాత్రం అత్యంత ఖరీదైన విదేశీ డిజైనర్ దుస్తులను ధరిస్తూ కనిపిస్తారు. ఆ దేశంలో బాలికలు జుట్టు పెంచుకోవడానికి అనుమతి లేకపోయినా, ఆమె మాత్రం పొడవాటి జుట్టుతో విభిన్నమైన ఆహార్యంతో కనిపిస్తారు. ఇది ఆమె సాధారణ పౌరురాలు కాదని, దేశంలో ఆమెకు ఉన్న ప్రత్యేక హోదాను ప్రతిబింబిస్తుంది.

నియంత ఇమేజ్ మార్చే ప్రయత్నం

కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన నియంత అనే ముద్రను పోగొట్టుకోవడానికి తన కుమార్తెను ఒక సాధనంగా వాడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తన కుమార్తెను ప్రేమగా చూసుకునే తండ్రిగా కనిపించడం ద్వారా, ప్రజల్లో తనపై ఉన్న భయాన్ని తగ్గించి సానుభూతి పొందేందుకు కిమ్ ప్రయత్నిస్తున్నారని కొందరు భావిస్తున్నారు.

అప్పుడే వారసురాలు ఎందుకు?

కిమ్ జోంగ్ ఉన్ వయసు ప్రస్తుతం 42 ఏళ్లు మాత్రమే. ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, టీనేజ్ వయసులోనే వారసురాలిని ప్రకటించడం వెనుక ఒక కారణం ఉంది. గతంలో కిమ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు సిద్ధపడటానికి చాలా తక్కువ సమయం దొరికింది. అందుకే తన కుమార్తెకు చిన్నతనం నుండే పూర్తిస్థాయిలో పాలనపై అవగాహన కల్పించాలని కిమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే మహాసభే కీలకం

ఈ నెలాఖరులో ఉత్తర కొరియాలో 'వర్కర్స్ పార్టీ కాంగ్రెస్' జరగనుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశంలో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఈ సభలో జు ఆయేకు ఏదైనా అధికారిక పదవి ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే, ఉత్తర కొరియా తదుపరి నేత జు ఆయే అని ప్రపంచం ఖరారు చేసుకోవచ్చు.