Let's talk: editor@tmv.in
ఉత్తరాలకు ఇక సెలవు.. డెన్మార్క్‌లో ముగిసిన 400 ఏళ్ల తపాలా వ్యవస్థ

ఉత్తరాలకు ఇక సెలవు.. డెన్మార్క్‌లో ముగిసిన 400 ఏళ్ల తపాలా వ్యవస్థ

Shaik Mohammad Shaffee
1 జనవరి, 2026

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న వేళ, డెన్మార్క్ దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఉత్తరాల బట్వాడాకు ఆ దేశం స్వస్తి పలికింది. మంగళవారంతో ఆ దేశ ప్రభుత్వ తపాలా సంస్థ 'పోస్ట్‌నార్డ్' తన చివరి ఉత్తరాన్ని డెలివరీ చేసింది. దీనితో సాంప్రదాయ తపాలా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది.

ఉత్తరాలు ఎందుకు ఆగిపోయాయి?

నేటి కాలంలో వాట్సాప్, ఈమెయిల్, సోషల్ మీడియా వాడకం పెరగడంతో ఉత్తరాలు రాసేవారు కనుమరుగయ్యారు. 2000వ సంవత్సరంతో పోలిస్తే 2024 నాటికి డెన్మార్క్‌లో ఉత్తరాల సంఖ్య 90 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయింది. ఉత్తరాలు పంపేవారు లేకపోవడంతో, ఆ వ్యవస్థను నడపడం ఆర్థికంగా భారంగా మారిందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ప్రతి డానిష్ పౌరుడు ఇప్పుడు డిజిటల్ సేవలను వాడుతున్నారని, అందుకే కాగితపు ఉత్తరాల అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు.

తపాల పెట్టెల వేలం.. వేలల్లో పోటీ!

ఈ మార్పులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 తపాలా పెట్టెలను తొలగించారు. అయితే, ప్రజలకు ఈ పెట్టెలతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ కారణంగా వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక్కో పెట్టెను సుమారు రూ.18,000 నుండి రూ.24,000 (భారత కరెన్సీలో) ధరకు వేలం వేశారు. వచ్చిన సొమ్మును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.

ఇకపై ఉత్తరం పంపాలంటే ఎలా?

ఇకపై వీధుల్లో తపాలా పెట్టెలు ఉండవు. ఒకవేళ ఎవరైనా ఉత్తరం పంపాలనుకుంటే, స్థానిక షాపుల్లో ఉండే చిన్న కియోస్క్‌లకు వెళ్లి ఇవ్వాలి. అక్కడి నుండి 'డీఏఓ' అనే ప్రైవేట్ కొరియర్ సంస్థ ఆ ఉత్తరాలను దేశవిదేశాలకు చేరుస్తుంది.

ప్రభుత్వ తపాలా సంస్థ ఏం చేస్తుంది?

ఉత్తరాలు ఆపేసినప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్‌నార్డ్ పూర్తిగా మూతపడదు. ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) పెరగడం వల్ల వచ్చే భారీ పార్శిళ్లు, వస్తువుల డెలివరీ సేవలను ఈ సంస్థ కొనసాగిస్తుంది. ఉత్తరాల కంటే ఇప్పుడు వస్తువుల బట్వాడాకు డిమాండ్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

వృద్ధుల పరిస్థితి ఏంటి?

డెన్మార్క్ డిజిటల్ రంగంలో ఎంతో ముందున్నప్పటికీ, ఈ నిర్ణయం పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నెట్ వాడటం తెలియని వృద్ధులు, సాంకేతికతకు దూరంగా ఉన్న వారు ఉత్తరాల సేవలు నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు పడతారని వారు హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాలకు ఇక సెలవు.. డెన్మార్క్‌లో ముగిసిన 400 ఏళ్ల తపాలా వ్యవస్థ - Tholi Paluku