
ఉత్తరాఖండ్ ‘ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని’గా ఎదగాలి:ప్రధాని మోడీ
ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్‌లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ సిల్వర్ జూబ్లీ ప్రధాన వేడుక ఆదివారం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాపన దినోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ మొత్తం రూ.8,140 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించి, పునాది వేశారు. వీటిలో రూ.930 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించగా, రూ.7,210 కోట్ల పథకాలకు శంకుస్థాపన చేశారు. తాగునీరు, సాగు, విద్యుత్, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి రంగాలకు సంబంధించిన పథకాలు వీటిలో ఉన్నాయి.
డెహ్రాడూన్ నగరంలోని 23 జోన్లకు తాగునీటి సరఫరా పథకం (అమృత్), పిథోరాగఢ్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు, నైనిటాల్ జిల్లా హల్ద్వానీ స్టేడియంలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ మైదానం ఉన్నాయి. అలాగే ఈ కింది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సాంగ్ డ్యాం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, దీని ద్వారా రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీరు దెహ్రాడూన్‌కు సరఫరా కానుంది. జమరాని డ్యాం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ (నైనిటాల్), ఇది తాగునీరు, సాగు, విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడనుంది. చంపావత్‌లో మహిళా క్రీడా కళాశాల, నైనిటాల్‌లో ఆధునిక డెయిరీ ప్లాంట్, పలు విద్యుత్ సబ్‌స్టేషన్లకు పునాది వేశారు. అలాగే పీఎం ఫసల్ బీమా యోజన కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.62 కోట్లు నేరుగా జమ చేశారు.
స్మారక తపాలా బిళ్ల విడుదల
రాష్ట్ర ఆవిర్భావానికి గుర్తుగా ప్రధాని మోడీ స్మారక తపాలా బిళ్ల విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు.
ఉత్తరాఖండ్‌కి రోజూ 4,000 మంది పర్యాటకులు
25 ఏళ్ల క్రితం ఆరు నెలల్లో ఒక్క 4,000 మంది మాత్రమే విమానాల ద్వారా ఉత్తరాఖండ్‌కి వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకి 4,000 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు అని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య 10 రెట్లు పెరిగాయి. అప్పట్లో ఒక్క మెడికల్ కాలేజీ మాత్రమే ఉండగా, ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ నిజమైన గుర్తింపు దాని ఆధ్యాత్మిక శక్తి. ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగా కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా కలుపుతూ రాష్ట్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఎదగగలదు. భారతదేశం మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా ప్రజలు ఆరోగ్య, వెల్‌నెస్ కోసం ఇక్కడికి వస్తున్నారు కొనియాడారు.
