
ఉత్తరాఖండ్‌లో చిరుత దాడులు.. ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్‌లో జరిగిన వేర్వేరు చిరుత దాడి ఘటనల్లో ఐదేళ్ల బాలుడు, 60 ఏళ్ల వృద్ధ మహిళ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రుద్రప్రయాగ్ జిల్లా సింద్రవాణి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్న బాలుడిని చిరుత అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి కోసం గాలింపు చేపట్టాయి. ఈ బృందానికి నాయకత్వం వహించిన రుద్రప్రయాగ్ సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ సోహన్ సింగ్ సైనీ తెలిపిన వివరాల ప్రకారం, ఏడు బృందాలు నిరంతర శోధన నిర్వహించగా, రాత్రి 11 గంటల సమయంలో అటవీ ప్రాంతంలో బాలుడి ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. మృతుడిని దక్ష్ బిష్ట్గా గుర్తించగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. చిరుత నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో, పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి, అటవీ శాఖ బృందాలు నిరంతర గస్తీ నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోని ఎనిమిది పాఠశాలలకు వచ్చే రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
ఇదిలా ఉండగా, నైనిటాల్ జిల్లా భీమ్తాల్‌లోని జూనా ఎస్టేట్ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. పశువుల కోసం మేత సేకరించేందుకు సోమవారం అడవికి వెళ్లిన గంగాదేవి (60) సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం అడవిలో ఓ లోతైన ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైందని, ఆమెపై చిరుత దాడి చేసిన స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చిరుతల కదలికలు చాలాకాలంగా ఉన్నప్పటికీ, అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే బోన్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నాథువాఖాన్ అటవీ రేంజ్ అధికారి విజయ్ భట్ మాట్లాడుతూ, ఘటన సమాచారం అందగానే అటవీ శాఖ, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గస్తీని మరింత కఠినతరం చేశామని ఆయన చెప్పారు.
