
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా భీకియాసేన్ ప్రాంతంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 12 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. భీకియాసేన్–వినాయక్ మోటార్ రోడ్డుపై వెళుతున్న ప్రయాణికుల బస్సు వినాయక్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సుమారు 17–18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలోనే ఏడుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని భీకియాసేన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై అల్మోరా ఎస్పీ దేవేంద్ర పించా మాట్లాడుతూ రక్షణ బృందాలను వెంటనే సంఘటన స్థలానికి పంపించాం. కొంతమంది మృతి చెందినట్లు సమాచారం అందింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ భీకియాసేన్–వినాయక్ మోటార్ రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరం. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.
గతంలో కూడా అల్మోరా జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 2024లో మార్చులా ప్రాంతంలో 50 మంది ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 36 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. అప్పట్లో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్, హల్ద్వానీలోని సుశీలా తివారీ ఆసుపత్రికి తరలించారు.
అల్మోరా బస్ ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోతైన లోయలో బస్సు పడిపోవడంతో ఆరుగురు నుంచి ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం అందడం అత్యంత విషాదకరమని ఆయన తెలిపారు. ప్రధాని కార్యాలయం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో జరిగిన బస్ ప్రమాదంలో ప్రాణ నష్టం కలగడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు.
