Let's talk: editor@tmv.in
ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త: శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీస్

ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త: శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రైలు సర్వీస్

Panthagani Anusha
11 ఏప్రిల్, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. జిల్లా రైల్వే చరిత్రలో ఓ నూతన అధ్యాయం మొదలైంది. దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ తర్వాత శ్రీకాకుళం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల్లో అమితానందాన్ని నింపుతోంది.

శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం 17439/40 నంబరు గల హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ సర్వీసుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు ప్రతి ఆదివారం తిరుపతిలో బయలుదేరి సోమవారం శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరిగి ప్రతి సోమవారం శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ నెల 13వ తేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో ఈ నూతన రైలు సేవలను ఘనంగా ప్రారంభించేందుకు అధికారులు సర్వసిద్ధం చేశారు.

నేరుగా రైలు సౌకర్యం వల్ల జిల్లా వాసులకు తిరుమల యాత్ర ఎంతో సులభతరం కానుంది. గతంలో తిరుపతి వెళ్లాలంటే విశాఖపట్నం లేదా విజయవాడలో రైళ్లు మారాల్సి వచ్చేది. దీనివల్ల ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో కూడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడేవి. ఇప్పుడు నేరుగా రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఖర్చు కూడా ఆదా అవుతుందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రైలు సాధనలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషిని జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు. రైల్వే శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సైతం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలిపారు