Let's talk: editor@tmv.in
ఉత్తరాంధ్ర దశ మార్చనున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్: ఏపీ సీఎం

ఉత్తరాంధ్ర దశ మార్చనున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్: ఏపీ సీఎం

Panthagani Anusha
25 మార్చి, 2026

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. "ఉత్తరాంధ్ర... ఇక ఉక్కు ఆంధ్ర" అంటూ ఆయన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చాటిచెప్పారు.

గత కొన్నేళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి కబ్జాలు, అభద్రత, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఆనందం, భవిష్యత్తుపై భరోసా కనిపిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ రంగంలోనూ ప్రతీ ప్రాంతంలోనూ మార్పు తెచ్చి చూపిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం 21 నెలల స్వల్ప కాలంలోనే ఇంతటి భారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికామని చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

దాదాపు రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రంగంలో దేశంలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల యువతకు లక్షలాది సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే, అనకాపల్లిలో రాబోతున్న ఈ నూతన ప్లాంట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు సరికొత్త దిక్సూచిగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ భారీ విజయం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని చంద్రబాబు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు ప్రతి దశలోనూ సానుకూల నిర్ణయాలతో ప్రోత్సహించిందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక కొత్త 'స్టీల్ సిటీ' నిర్మితమవుతోందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలోనే ఉత్తరాంధ్రలో అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు కనిపిస్తాయని ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.