
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏ పి మంత్రి నిమ్మల సమీక్ష
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్, ఉత్తరాంద్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇత ర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నిమ్మల మాట్లాడుతూ గత 5ఏళ్ళ వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, కాని నాడు 2014-19 టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంద్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశాడు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్ళలో రూ.2వేల కోట్లు పైగా ఖర్చు చేసి, కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నాం.అన్నారు.
బిఆర్‌ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, మహేంద్ర తనయ, తారకరామతీర్ధసాగర్,మడ్డువలస రిజర్వాయర్, వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు, 2.48లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమవుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు, కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోంది. ఈనెలలో చంద్రబాబు ఉత్తరాంద్ర లో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తయ్యేలా దిశా నిర్దేశం చేయనున్నారు అన్నారు.
