Let's talk: editor@tmv.in
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Panthagani Anusha
29 సెప్టెంబర్, 2025

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలోని ఖేరీ పట్టణం హైవేలోని ఒయెల్ టర్న్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దాదాపు 15 మందిని ఎక్కించుకొని వెళ్తున్న ఒక ప్రైవేట్ వ్యాన్, అదే మార్గం గుండా ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును (స్టేట్ రోడ్వేస్ బస్సు) బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం లఖింపూర్ సీతాపూర్ హైవేపైని ఒయెల్ టర్న్ వద్ద జరిగింది. హైవేపై జరుగుతున్న మరమ్మత్తుల కారణంగా రెండు వైపుల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అధికారులు ఒకే మార్గంలోకి మళ్లించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని డీఎం దుర్గా శక్తి నాగ్పాల్ స్పష్టం చేశారు. ఘర్షణ తీవ్రతకు వ్యాన్ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురిలో నలుగురి వివరాలను గుర్తించారు అధికారులు. కాగా మృతులలో వ్యాన్ డ్రైవర్ పిపరియా గ్రామానికి చెందిన సునీల్ (25) డాటెలీ గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల చిన్నారి సరఫ్రాజ్ ఉన్నారు. వీరితో పాటు ప్రయాణికులైన బుధ్‌రామ్, రామ శంకర్ మరణించారు. ఐదవ మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అదేవిదంగా తీవ్రంగా గాయపడిన మొత్తం 10 మందిలో ఏడుగురిని అత్యవసర చికిత్స కోసం తక్షణమే లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు కాగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

డీఎం దుర్గా శక్తి నాగ్పాల్ మాట్లాడుతూ, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.అదే విధంగా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి, ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించి భద్రతా చర్యలను అమలు చేస్తామని ఆమె ప్రకటించారు.

ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరోవైపు స్థానిక అధికారులు భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మార్గదర్శక చర్యలు చేపట్టనున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Tholi Paluku