
ఉత్తమ్‌నగర్ నిందితుడి ఇంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో హోలీ సందర్భంగా జరిగిన ఘర్షణలో 26 ఏళ్ల యువకుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి, నిందితుల్లో ఒకరి ఇంటికి చెందిన అక్రమ నిర్మాణాలను ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, పూర్తి ఇల్లు కాకుండా అక్రమంగా నిర్మించిన భాగాలను మాత్రమే బుల్డోజర్లతో తొలగించారు. ఈ చర్యను డ్రైనేజీపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మాన్సూన్ సమయం సమీపిస్తున్నందున కాలువలపై నిర్మించిన నిర్మాణాలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని, అందుకే వాటిని తొలగిస్తున్నామని పశ్చిమ జోన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. కూల్చివేత సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సైనిక దళాలను భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ప్రాంతాన్ని జోన్లు, సెక్టార్లు, ఉపసెక్టార్లుగా విభజించి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ బలగాలను కూడా మోహరించారు.
ఈ ఘటన మార్చి 4న చోటుచేసుకుంది. జేజే కాలనీ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. ఒక బాలిక విసిరిన నీటి బెలూన్ నుంచి వచ్చిన నీరు పొరుగు కుటుంబానికి చెందిన మహిళపై పడటంతో వివాదం చెలరేగి హింసకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాత్మక చర్యలను ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆమె స్పష్టం చేశారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపంతో ఉన్న కొందరు వ్యక్తులు వాహనాలను ధ్వంసం చేసి, కొన్నింటికి నిప్పంటించడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
