Let's talk: editor@tmv.in
ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ ‘వన్ రన్’ విక్టరీ
ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ ‘వన్ రన్’ విక్టరీ
ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ ‘వన్ రన్’ విక్టరీ

ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ ‘వన్ రన్’ విక్టరీ

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆఖరి వరకు పోరాడి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గెలుపు ముంగిట చేసిన ఒక చిన్న పొరపాటు ఆ జట్టుకు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలవ్వగా, గుజరాత్ ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని నమోదు చేసింది.

బట్లర్ మెరుపులు.. గిల్, వాషింగ్టన్ జోరు

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు జోస్ బట్లర్ (52; 27 బంతుల్లో, 5 సిక్సర్లు) ఆరంభంలోనే భారీ ఊపునిచ్చారు. ముకేశ్ కుమార్ వేసిన ఒకే ఓవర్‌లో మూడు భారీ సిక్సర్లతో 23 పరుగులు రాబట్టి పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బట్లర్ నిష్క్రమించాక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (70; 45 బంతుల్లో) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. కుల్దీప్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని గిల్ ఆడిన స్లాగ్ స్వీప్‌లు ఆకట్టుకున్నాయి. వీరికి తోడుగా నాలుగో స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ (55; 32 బంతుల్లో) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఒక దశలో 220 దాటుతుందనుకున్నా, ఎంగిడి (1/24) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టైటాన్స్‌ను అడ్డుకున్నారు.

రాహుల్ వీరోచిత పోరాటం.. రషీద్ బ్రేకులు

లక్ష్య ఛేదనలో ఢిల్లీకి కెప్టెన్ కేఎల్ రాహుల్ (92; 52 బంతుల్లో), పాతుమ్ నిస్సాంక (41) అద్భుతమైన పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 49 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. అయితే మధ్య ఓవర్లలో రషీద్ ఖాన్ (3/17) తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు తీసి ఢిల్లీ జోరుకు బ్రేకులు వేశారు. ఒక దశలో 19వ ఓవర్‌లో 36 పరుగులు కావాల్సిన తరుణంలో గాయం నుంచి కోలుకుని క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్; 20 బంతుల్లో) సిరాజ్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పారు.

ఆఖరి ఓవర్ హైడ్రామా.. మిల్లర్ తప్పిదం

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాలి. రెండో బంతికి విప్రజ్ నిగమ్ ఫోర్ కొట్టి అవుట్ కాగా, చివరి మూడు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. నాలుగో బంతికి మిల్లర్ భారీ సిక్సర్ బాదడంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతిని మిల్లర్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు, అయితే సులభంగా సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. భాగస్వామి కుల్దీప్‌పై నమ్మకం లేక మిల్లర్ పరుగుకు నిరాకరించాడు. చివరి బంతిని కూడా మిల్లర్ మిస్ చేయగా, బైస్ రన్ కోసం ప్రయత్నించిన కుల్దీప్‌ను బట్లర్ రన్ అవుట్ చేశాడు. అది వైడ్ అని ఢిల్లీ రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో ఢిల్లీకి ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురవ్వగా, గుజరాత్ మూడో ప్రయత్నంలో విజయాన్ని అందుకుంది.