
ఉత్పత్తి పెంచండి సహకరిస్తాం: నిర్మలాసీతారామన్
దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావాలని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థాన్ని పెంచేందుకు ఎలాంటి సంకోచం ఇక నుంచి ఉండదని ఆశిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కంపెనీలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నాయో, వారి అవసరాలను ప్రభుత్వం ముందు ఉంచాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నుంచి మీకందరికీ తెలుసు. సంస్కరణల విషయంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కంపెనీల అవసరాలను ఎప్పుడూ విస్మరించలేదు అంటూ నిర్మాల సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమ కోరుకుంటున్నట్టుగానే ప్రభుత్వం స్థిరమైన విధానాలతో ముందుకు వెళ్తోందని తెలిపారు.
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, కానీ భారత ఆర్థిక వృద్ధి మాత్రం స్థిరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. దీనికి దేశీయంగా ఉన్న డిమాండు, తేలికపాటి ద్రవ్యోల్బణం కారణమని అన్నారు. ట్రంప్ సుంకాలు, సప్లై చైన్ లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో భారత వృద్ధికి ఎలాంటి డోకాలేదని ఎస్ అండ్ పి గ్లోబల్ అంచనాను సమావేశంలో నిర్మలాసీతారామన్ ప్రస్తావించారు. పరిశ్రమలు మరింత ఉత్పత్తి చేయాలని, డిమాండ్ పెరిగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమ ప్రతినిధులకు ఆమె భరోసానిచ్చారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, ఆదాయపు పన్ను రాయతీలు కలిసి డిమాండ్ పెరగడానికి దోహదం చేస్తాయని సమావేశానికి హాజరైన పరిశ్రమ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
