
ఉడాన్ విస్తరణకు కేంద్రం ఆమోదం
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ విస్తరణ, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఆధునీకరణ, వాతావరణ లక్ష్యాల పెంపు వంటి అంశాలపై ప్రధాన నిర్ణయాలు వెల్లడించారు. ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి మోడిఫైడ్ ఉడాన్ పథకానికి ఆమోదం తెలిపారు. రూ.28,840 కోట్ల వ్యయంతో 2026-27 నుంచి 2035-36 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 100 కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, 200 ఆధునిక హెలిప్యాడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. టియర్-2, టియర్-3 నగరాలకు మెరుగైన విమాన సదుపాయాలు కల్పించడంతో పాటు, విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రాంతీయ ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ఆర్థిక సహాయం, విమానయాన సంస్థలకు రూ.10,043 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అందించనున్నారు.
ఇక ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ (ఐవీఎఫ్ఆర్‌టీ)ను 2026 నుంచి 2031 వరకు కొనసాగించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. డిజిటల్, ఫేస్‌లెస్ వీసా సేవలు, వేగవంతమైన క్లియరెన్స్ ప్రక్రియలతో ప్రయాణికులకు సౌలభ్యం కల్పించడంతో పాటు జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఈ-వీసా దరఖాస్తుల్లో 91 శాతం 72 గంటల్లో క్లియర్ అవుతున్నాయి. ప్రధాన విమానాశ్రయాల్లో ఈ-గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ సమయం 30 సెకన్లకు తగ్గింది.
మెరుగైన పర్యావరణం కోసం
వాతావరణ మార్పుల నియంత్రణలో భాగంగా భారత్ తన నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ (ఎన్‌డీసీ) 2031–2035 లక్ష్యాలను కూడా పెంచింది. 2035 నాటికి జీడీపీ ఉద్గార తీవ్రతను 47 శాతం తగ్గించడం, విద్యుత్ ఉత్పత్తిలో 60 శాతం నాన్-ఫాసిల్ ఇంధన వనరుల వినియోగం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అటవీ, పర్యావరణం ద్వారా 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ సృష్టించాలని నిర్ణయించింది. ఈ చర్యలు 2070 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని చేరుకునే దిశగా కీలకంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, స్థిర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు చర్యలను వేగవంతం చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పునరుత్పాదక శక్తి విస్తరణ, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయం, నీటి వనరులు, గ్రామీణాభివృద్ధిలో కూడా క్లైమేట్ అనుకూల చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘లైఫ్ ’ ఉద్యమం, “మాకే నామ్ ఏక్ పేడ్ ’ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకమని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా, ఈ నిర్ణయాలు దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటకం, ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
