Let's talk: editor@tmv.in
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీపీ సజ్జనార్

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
3 ఆగస్టు, 2026

సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్, భాగ్యనగరంలో బోనాల పండుగకు విశిష్టమైన చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. నగరవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు విజయవంతంగా ముగియగా, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా దాదాపు 2,500 మంది పోలీసు సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ వెల్లడించారు. భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ఈసారి తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు అనుసంధానంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించి పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను వేగంగా గుర్తించే అవకాశం కల్పించినట్లు వివరించారు.

అలాగే ఆలయంలోకి వచ్చే, బయటకు వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. క్యూలైన్లలో రద్దీ సాంద్రతను థ్రెషోల్డ్ మ్యాపింగ్ సాయంతో నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే వెంటనే చర్యలు తీసుకుని తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు.

బోనాల ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం కొనసాగిస్తున్నామని సీపీ తెలిపారు. భక్తులందరూ పోలీసు శాఖకు సహకరించి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, డీసీపీ అవినాశ్ కుమార్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీపీ సజ్జనార్ - Tholi Paluku