Let's talk: editor@tmv.in
ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమమే లక్ష్యం: కవిత
ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమమే లక్ష్యం: కవిత

ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమమే లక్ష్యం: కవిత

Gaddamidi Naveen
20 జులై, 2026

తెలంగాణ ప్రజల అస్తిత్వం, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తాను "తెలంగాణ రక్షణ సేనష‌ (టీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత డాక్టర్ రఘు తన అనుచరులతో కలిసి కవిత సమక్షంలో పార్టీలో చేరారు. డాక్టర్ రఘు చేరికతో కోరుట్లలో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా తాను నమ్మిన పార్టీ కోసం పనిచేస్తే, అక్కడి అవినీతిని, బీసీల సమస్యలను అంతర్గతంగా ప్రశ్నించినందుకు ఓర్వలేక కొన్ని గుంటనక్కలు కుట్ర చేసి నన్ను బయటకు పంపించాయన్నారు. పుట్టినగడ్డ బాగుండాలనే తపనతో, అంతర్జాతీయ ప్రముఖుల సలహాలతో పేదల బతుకులు మార్చడానికే ఈ కొత్త పార్టీని స్థాపించానని తెలిపారు. అధర్మంపై యుద్ధానికి శ్రీకృష్ణుడు ఊదిన పాంచజన్యం స్ఫూర్తితో.. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు భరోసా, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం అనే 5 కీలక అంశాలతో (పాంచజన్యం) ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద పిల్లల ఫీజులను పూర్తిగా తమ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితులతో సంబంధం లేకుండా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. దీనికి ప్రస్తుత బడ్జెట్ సరిపోతుందని, అవినీతిని అరికడితే ఇది సాధ్యమేనని లెక్కలతో సహా ఆమె నిరూపించారు. యువతకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చి, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు స్థాపించేలా ప్రోత్సహిస్తామన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో రైతుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ 50 శాతం మందికి కూడా అమలు కాలేదని విమర్శించారు. వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు కోసం పోరాడతామన్నారు. కేబినెట్‌లో లంబాడాలకు చోటు లేకపోవడం సిగ్గుచేటన్నారు. మైనార్టీల ఆర్థిక సాధికారితకు క్రైస్తవులు, ముస్లింల కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

వాతావరణ నిపుణులు 'సూపర్ ఎల్ నినో' వస్తుందని ఏడు నెలల ముందే హెచ్చరించినా సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదని కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో 40 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గోదావరిలో 418 టీఎంసీలకు గానూ కేవలం 93 టీఎంసీల నీరే మిగిలిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్‌పల్లి, కోరుట్లలో వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం వాడుకోవడం లేదని, దేని గురించి ప్రశ్నించినా ఎదురుదాడి చేయడమే రేవంత్ రెడ్డి విధానంగా మారిందని క‌విత‌ దుయ్యబట్టారు.

సభ అనంతరం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 'తెలంగాణ రక్షణ సేన' ఒక బలమైన శక్తిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జల వనరులు, వ్యవసాయంపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి పాలనలో ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని ఆమె పేర్కొన్నారు. తంగేడు, గుమ్మడి, గౌరమ్మ పువ్వులతో కూడిన తమ జెండాకు ప్రజల దీవెనలు కావాలని కవిత పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
KalvakuntlaKavithaTelanganaRakshanaSenaKorutlaPanchajanyaSankalpaSabhaTelanganaPoliticsPoliticalNewsTelanganaFreeEducationFreeHealthcareFarmerWelfareSocialJustice
ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమమే లక్ష్యం: కవిత - Tholi Paluku