Let's talk: editor@tmv.in
ఉచిత విద్యుత్, సోలార్ టార్గెట్లు, ఈవీలపై సీఎం ఆదేశాలు

ఉచిత విద్యుత్, సోలార్ టార్గెట్లు, ఈవీలపై సీఎం ఆదేశాలు

Dantu Vijaya Lakshmi Prasanna
3 డిసెంబర్, 2025

అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సామాజిక సంక్షేమం (చేనేత/పవర్ లూమ్స్ ఉచిత విద్యుత్), పునరుత్పాదక ఇంధన రంగం వృద్ధి (సోలార్ లక్ష్యాలు), పర్యావరణ అనుకూల రవాణా అనే మూడు ప్రధాన రంగాలపై ఏకకాలంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఉచిత విద్యుత్ అమలు

చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకాన్ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029 నాటికి 9.20% నుండి గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు

పీఎం-కుసుమ్ పథకం కింద 4,792 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. (వ్యవసాయంలో సౌర శక్తిని ప్రోత్సహించే పథకం ఇది). అలాగే ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను త్వరగా అమర్చుకోవాలని, దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు.

రవాణా రంగంలో మార్పులు

ముఖ్యమంత్రి రోడ్డు రవాణా సంస్థ లో కీలకమైన మార్పులను ప్రకటించారు. ఆర్టీసీ బస్సులన్నింటినీ దశలవారీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మార్చాలని ఆదేశించారు. తక్షణమే 1,000 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్దేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని అధికారులకు సూచించారు.

ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి దృష్టి

విద్యుత్ సంస్థలు (ట్రాన్స్‌కో/డిస్కంలు) కేవలం విద్యుత్ టారిఫ్ ద్వారా వచ్చే ఆదాయంపైనే కాకుండా, నాన్ టారిఫ్ ఆదాయం పైన కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నాన్ టారిఫ్ ఆదాయాన్ని పెంచడం ద్వారా సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వ్యయం తగ్గింపు, పీఎం కుసుమ్, సోలార్ రూఢాప్ వంటి పథకాల పురోగతిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఎంఓయూలు కుదుర్చుకోవాలని కూడా సీఎం స్పష్టం చేశారు. (గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు 20 పైసల చొప్పున కొనుగోలు వ్యయం తగ్గినట్లు సీఎస్ కె. విజయానంద్ వివరించారు.)

పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్తప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లోపుగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తయ్యే బూడిదను పరిశ్రమలు, నిర్మాణాలు సహా వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖకు సూచించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ పొదుపు ఉపకరణాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అన్నారు.

రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా గుర్తించిన ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వంపై రూ. 1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 60 రోజుల్లోనే అనుమతులు జారీ చేసి, వారి కార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఒక న్యూఎనర్జీ హబ్‌గా మారాలని దిశానిర్దేశం చేశారు.

సమీక్షలో గత ప్రభుత్వ అసమర్ధతల కారణంగా విద్యుత్ రంగం అస్తవ్యస్తమైందని, ముఖ్యంగా పీపీఏల రద్దు నిర్ణయంతో ప్రజలపై రూ.9,000 కోట్ల భారం పడిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ వినియోగించకుండానే ఆ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించడం వైసీపీ ప్రభుత్వ గొప్ప తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని సరిదిద్దుతూ ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా సమర్ధవంతంగా వ్యవస్థను నడిపిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె. విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో అధికారులు, డిస్కంల సీఎండీలు హాజరయ్యారు.

ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం

పీఎం-కుసుమ్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం రైతుల విద్యుత్ భద్రత ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం రైతులకు సౌర పంపుల ద్వారా మరింత సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం. రైతులు తమ వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని, తమ అవసరాలకు వాడుకోగా, మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకునే వెసులుబాటు కల్పించడం. దీని ద్వారా రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (సమీక్షలో పేర్కొన్న లక్ష్యం ప్రకారం) ఈ పథకం కింద 4,792 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సబ్సిడీ మరియు సౌకర్యాలు:

ఈ పథకం కింద సోలార్ పంపులు, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60% వరకు సబ్సిడీని అందిస్తుంది. 3 ఎచ్ పి నుంచి 5 ఎచ్ పి సోలార్ పంపులను అమర్చుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రైతులకు సబ్సిడీతో పాటు కొన్ని రాష్ట్రాలు రూ. 45 వేలు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి.

అర్హతలు & సామర్థ్యం:

భారతీయ శాశ్వత పౌరుడై ఉండాలి మరియు తప్పనిసరిగా రైతు అయి ఉండాలి. రైతులు తమ భూమిలో 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు వ్యక్తిగతంగా, లేదా సంఘాలుగా, సహకార సంఘాలు లేదా స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన (సోలార్ రూఫ్‌టాప్ పథకం)

ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా ₹78,000 వరకు సబ్సిడీని అందిస్తుంది.ఈ పథకం ద్వారా లబ్ధిదారులు సంవత్సరానికి దాదాపు ₹32,000 వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. సబ్సిడీ కూడా ఉంటుంది.

దరఖాస్తు విధానం:

దరఖాస్తుదారులు pmsuryaghar.gov.in అనే అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా, సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాలు లేదా సీఎస్సీ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు రేషన్ కార్డ్ లు తప్పకుండా ఉండాలి.