
ఉచిత పథకాల సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ‘ఫ్రీబీలు’ (ఉచిత పథకాలు)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఉచితాల పంపిణీ దేశ ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని వ్యాఖ్యానించింది. గురువారం దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ ఈ విధమైన లార్జెస్ పంపిణీ వల్ల దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుంది. రాష్ట్రం ప్రజలకు సహాయం చేయడం తన బాధ్యతే. కానీ ఫ్రీబీలు పొందుతున్నవారి అంశం కూడా పరిశీలించాల్సిందే అని మౌఖికంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు ఆదాయ లోటుతో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను కొనసాగిస్తున్నాయని కోర్టు గమనించింది. ఒక ఏడాదిలో సేకరించే ఆదాయంలో కనీసం 25 శాతం రాష్ట్ర అభివృద్ధికి వినియోగించలేరా? అని సీజేఐ ప్రశ్నించారు. ఇది ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
పేదలకు సహయం చేయడం సమంజసమే
దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్, చెల్లించలేని పేదలకు సహాయం చేయడం సమంజసం. కానీ చెల్లించగలవారికి కూడా తేడా లేకుండా ఉచితంగా ఇవ్వడం సముచితం కాదేమో? అని ప్రశ్నించారు. ఇది ప్రజలను ప్రసన్నం చేసుకునే విధానమా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇస్తూ ఉంటే పని సంస్కృతి ఏమవుతుంది? అని సీజేఐ ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేయడం కంటే వేతనాలు చెల్లించడం, ఫ్రీబీలు పంపిణీ చేయడంపైనే దృష్టి పెడుతున్నాయన్నారు. అయితే, విద్యుత్ సవరణ నియమావళి–2024లోని ఒక నిబంధనను సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చీ మాట్లాడుతూ ఇది ప్రణాళికాబద్ధ వ్యయం కావాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎంత నిధులు కేటాయిస్తున్నామో బడ్జెట్‌లో స్పష్టంగా చూపించాలన్నారు.
తమిళనాడు పిటిషన్ నేపథ్యం
ఈ వ్యాఖ్యలు తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా వెలువడ్డాయి. సంస్థ కేంద్రం రూపొందించిన విద్యుత్ (సవరణ) నియమాలు–2024లోని రూల్ 23ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. కేంద్రం రూపొందించిన సస్టైనబిలిటీ నియమాల ప్రకారం విద్యుత్ టారిఫ్‌లు ఖర్చులకు అనుగుణంగా ఉండాలి. అలాగే ఆమోదించిన వార్షిక ఆదాయ అవసరం (ఏఆర్ఆర్), టారిఫ్ ద్వారా అంచనా వేసే వార్షిక ఆదాయం మధ్య తేడా 3 శాతం మించకూడదు (ప్రకృతి వైపరీత్యాల మినహాయింపు తప్ప). తమిళనాడు ప్రభుత్వం వాదన ఏమిటంటే, ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత, సబ్సిడీ విద్యుత్ విధానాలు ప్రభావితమవుతున్నాయి. రూల్ 23ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరింది. ఈ రూల్ యాదృచ్ఛికం, అన్యాయం, అమలు చేయలేనిది, రాజ్యాంగ విరుద్ధం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం, అలాగే విద్యుత్ చట్టం–2003 నిబంధనలను అతిక్రమిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై స్పందన ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
