Let's talk: editor@tmv.in
ఉచిత వైద్య‌సేవ‌ల‌పై దుష్ప్ర‌చారం!

ఉచిత వైద్య‌సేవ‌ల‌పై దుష్ప్ర‌చారం!

FL - SUNL
20 సెప్టెంబర్, 2025

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో డా.ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత సేవ‌లు పొందే ల‌బ్దిదారులు, అందుకు సంబంధించిన వ్య‌యంలో భారీ వృద్ధి న‌మోదైంద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఉద‌యం శాన‌స స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల కాల స‌మ‌యంలో ఇందుకు సంబంధించిన వివ‌రాల్ని తెలిపారు. ఉచిత వైద్య సేవ‌ల ప‌థ‌కం అమ‌లుపై కొంద‌రు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ఈ వాస్త‌వాలు ఎండ‌గ‌ట్టాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంపై స‌భ్యుడు మ‌హ‌మ్మ‌ద్ న‌జీర్ అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి వివ‌రాణాత్మ‌క స‌మాధాన్నిచ్చారు.

నాటికి నేటికి వ్య‌త్యాసం

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో మొద‌టి ఏడాదైన 2024-25లో డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ల‌బ్దిదారుల సంఖ్య 6.68 శాతం పెరిగి 13,42,673కు చేరుకుంద‌ని మంత్రి తెలిపారు. 2023-24లో ల‌బ్దిదారుల సంఖ్య 12,53,065 అని తెలిపిన మంత్రి కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో ల‌బ్దిదారుల సంఖ్య దాదాపు 90,000 పెరిగింద‌ని తెలిపారు. ఈ కాలంలో ప్రిఆథ‌రైజేష‌న్ ద్వారా ప్ర‌భుత్వం అనుమ‌తించిన వ్య‌యం 7.88 శాతం పెరిగింద‌ని మంత్రి చెప్పారు.

ఉచిత వైద్య సేవ‌ల‌కు సంబంధించిన వ్య‌యం వివ‌రాల్ని కూడా మంత్రి వెల్ల‌డించారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత సేవ‌ల నిమిత్తం గతేడాది జూన్ నుంచి ఈ సెప్టెంబ‌రు వ‌ర‌కు గ‌ణ‌నీయంగా పెరిగి రూ.6,458 కోట్ల మేర‌కు ఉండ‌వ‌చ్చ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. ఇందులో 2024-25కు సంబంధించి నిర్ధార‌ణైన ఖ‌ర్చు రూ. 4,290.05 కోట్లని, ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 3,732.22 కోట్ల మేర‌కు కూట‌మి ప్ర‌భుత్వం చెల్లింపులు చేయ‌గా మ‌రో రూ.557.83 కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని మంత్రి వివ‌రించారు. దీనికి అద‌నంగా రూ.2,168.16 కోట్ల బిల్లులు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వీటితో క‌లిపి కూట‌మి ప్ర‌భుత్వ మొద‌టి 15 నెల‌ల కాలంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ‌ల ఖ‌ర్చు దాదాపు రూ.6,500 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని మంత్రి వివ‌రించారు.

గ‌త ప్ర‌భుత్వ బ‌కాయిల చెల్లింపు

కూట‌మి పాల‌న‌లో పెరిగిన ఉచిత వైద్య సేవ‌లకు నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు త‌గిన స‌మ‌యంలో చెల్లింపులు చేయ‌డంతో పాటు గ‌త ప్ర‌భుత్వం పెట్టిన రూ.2,221.60 కోట్ల బ‌కాయిల‌ను త‌మ ప్ర‌భుత్వం చెల్లించింద‌ని మంత్రి తెలిపారు. ఈ మేర‌కు పెట్టిన బ‌కాయిల ద్వారా పేద‌ల వైద్యం ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వానికి ఏ మేర‌కు చిత్త‌శుద్ధి ఉందో వెల్ల‌డ‌వుతోంద‌ని మంత్రి దుయ్య‌బ‌ట్టారు.

దుష్ప్ర‌చారాన్ని ఖండించిన మంత్రి

డా. ఎన్టీఆర్ వైద్య సేవ‌ల ల‌బ్దిదారుల సంఖ్య, వ్య‌యం కూట‌మి పాల‌న‌లో భారీగా వృద్ధి న‌మోదు చేసినా, ఉచిత వైద్య సేవ‌ల ప‌థ‌కం నిర్వీర్య‌మైంద‌ని కొంద‌రు వ్య‌క్తులు, సంస్థ‌లు దుష్ప్ర‌చారాన్ని చేయ‌డాన్ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తీవ్రంగా ఖండించారు. ఈ ప‌థ‌కం ఆగిపోయింద‌ని దుష్ప్ర‌చారం చేసి, పేద‌ల్ని సేవ‌ల‌కు దూరంగా ఉంచి త‌ద్వారా కొంద‌రు మ‌ర‌ణిస్తే రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని వారి కుట్ర అని మంత్రి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

పెరిగిన నిఘా

గ‌త ప్ర‌భుత్వ నిర్వాకాల‌తో ఉచిత వైద్య సేవ‌ల అమ‌లులో అక్ర‌మాల‌కు సంబంధించి ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో వీటిని అరికట్ట‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం నిఘా పెంచింద‌ని తెలుపుతూ అందుకు సంబంధించిన వివ‌రాల్ని స‌భ‌లో మంత్రి వెల్ల‌డించారు. 2023-24లో అక్ర‌మాల‌కు సంబంధించి గ‌త ప్ర‌భుత్వం 28 నెట్వ‌ర్క్ ఆస‌ప‌త్రుల‌పై రూ. 7.68 కోట్ల మేర‌కు జ‌రిమానాలు విధించి, అందులో కేవ‌లం రూ.3.75 కోట్లు (49 శాతం) మాత్ర‌మే వ‌సూలు చేసింద‌ని తెలిపారు. దీనికి భిన్నంగా కూట‌మి ప్ర‌భుత్వం రూ. 22.74 కోట్ల మేర‌కు జ‌రిమానాలు విధించి అందులో రూ.19.35 కోట్లు (85 శాతం) వ‌సూలు చేసింద‌ని, దీన్నిబ‌ట్టి అక్ర‌మాల్ని అరిక‌ట్టే విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి వెల్ల‌డ‌వుతోంద‌ని మంత్రి స‌భ‌లో వివ‌రించారు.

నూత‌న ఆరోగ్య బీమా ప‌థ‌కం

హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఆరోగ్య బీమా క‌ల్పించే ప‌థ‌కాన్ని త్వ‌ర‌లో అమ‌ల్లోకి తెస్తామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. పేద‌రికంలో ఉన్న 1.43 కోట్ల కుటుంబాలు, పేద‌రిక రేఖ‌పై ఉన్న 20 ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.2.50 ల‌క్ష‌ల మేర‌కు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా క‌ల్పిస్తామ‌ని మంత్రి అన్నారు. పేద‌రికంలో ఉన్న కుటుంబాల‌కు రూ.2.50 ల‌క్ష‌ల‌కు పైన రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్ర‌స్టు ద్వారా ఆరోగ్య సేవ‌ల ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని మంత్రి వివ‌రించారు.

గుంటూరు జీజీహెచ్ కు కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ.18.77 కోట్ల బ‌కాయిల‌ను చెల్లించిందని, మ‌రో రూ.4.09 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంద‌ని మంత్రి తెలిపారు. క్యాన్స‌ర్ సేవ‌ల‌కు సంబంధించి గుంటూరు జీజీహెచ్‌ను లెవ‌ల్-1 సెంట‌ర్ గా తీర్చిదిద్దేందుకు ఆధునిక పెట్ సిటి స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశామ‌ని మంత్రి తెలిపారు. పూర్వ విద్యార్థుల స‌హాయంతో రూపుదిద్దుకుంటున్న నూత‌న ఎంసిహెచ్ బ్లాకు కోసం భారీ ఎత్తున ప‌రిక‌రాల్ని కొనుగోలు చేయ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసింద‌ని మంత్రి తెలిపారు.

ఉచిత వైద్య‌సేవ‌ల‌పై దుష్ప్ర‌చారం! - Tholi Paluku