
ఉగ్రవాద దాడుల కుట్ర భగ్నం–గుజరాత్‌లో ముగ్గురు అరెస్ట్
దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు కుట్ర చేస్తున్న ముగ్గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరు అహ్మదాబాద్‌లో ఆయుధాలను సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నుంచే వీరి కదలికలపై ఏటీఎస్ నిఘా ఉంచిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపాలని వీరు కుట్ర పన్నారు. ఆయుధాల సరఫరా సమయంలో వీరిని అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు. ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. వీరు ఇక్కడ ఉగ్రవాదులను తయారు చేసే పనిలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే వీరిలో ఇద్దరు పశ్చిమ ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారిగా, మరో వ్యక్తిని హైదరాబాద్ కు చెందినవాడిగా సమాచారం.
గతంలో కూడా గుజరాత్ ఏటీఎస్ అనేక ఉగ్ర ముఠాల కుట్రలను ఛేదించింది. ఈ ఏడాది ఆరంభంలోనే అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) కు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక మహిళను కూడా ఏటీఎస్ అరెస్ట్ చేసింది. బెంగళూరుకు చెందిన సమా పర్వీన్ (30) అనే మహిళను ఆన్‌లైన్ టెర్రర్ మాడ్యూల్ నడపడంతో పాటు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అదే కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు ఉగ్రవాదులను జూలై 23న ఏక్యూఐఎస్ కు చెందిన వారిని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఢిల్లీకి చెందిన మొహమ్మద్ ఫైక్, అహ్మదాబాద్‌కు చెందిన మొహమ్మద్ ఫర్దీన్, అరవల్లి జిల్లా మోడాసాకు చెందిన సెఫుల్లా ఖురేషీ, ఉత్తరప్రదేశ్ నోయిడాకు చెందిన జీషాన్ అలీ ఉన్నారు.
ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడి
ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి ప్రకారం ప్రత్యేక ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించాం. వీరు ఏక్యూఐఎస్ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. కొంతకాలంగా వీరిపై నిఘా కొనసాగిస్తూ, సరైన సమయానికి దాడి చేసి అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు ముగ్గురిని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి లభించిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, నిధుల మార్గాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడంతో గుజరాత్ ఏటీఎస్ దేశ భద్రతలో మరోసారి కీలక భూమిక పోషించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
