
ఉగ్రవాద ఆరోపణలపై పాక్ ఉలికిపాటు!
అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ సతమతమవుతోంది. చివరికి ఉగ్రవాదం పేరెత్తితే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వ్యవహరిస్తోంది. ఐక్య రాజ్య సమితి సాధారణ సమావేశాల్లో భాగంగా భారత్ పాకిస్తాన్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. అయితే ఇందులో ఎక్కడా పాక్ పేరు ప్రస్తావించలేదు. అయినా పాకిస్తాన్ తమనే విమర్శించినట్లు భావించి దీనిపై స్పందించడం గమనార్హం.
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ శనివారం ఐరాస సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచంలోని పెద్ద ఉగ్రవాద దాడులన్నీ ఒకే దేశానికి చెందినవన్నారు. ఉగ్రవాద కేంద్రమైన పొరుగు దేశం అదే ఉగ్రవాదానికి బలైపోతుందన్నారు. భారత్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదాన్ని సవాలును ఎదుర్కొంటోందని చెప్పారు. అనంతరం అదే రోజు పాక్ ప్రతినిధి తన ప్రసంగంలో భారత్ కావాలనే పాకిస్తాన్‌పై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తమపై వస్తున్న ఉగ్రవాద ఆరోపణలన్నీ అబద్ధాలేనన్నారు. జైశంకర్ తన ప్రసంగంలో పాకిస్తాన్ పేరు చెప్పకపోయినా పాక్ ప్రతినిధి ప్రతిస్పందించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భారత్ స్పందిస్తూ ఉగ్రవాదంపై తమ దేశం పేరు చెప్పకపోయినా పొరుగు దేశం ప్రతిస్పందించిందంటే ఉగ్రవాదాన్ని అంగీకరించినట్లేనన్నారు. "పాక్ ఖ్యాతిని తనంతట తానే చెప్పుకుంటుంది. దాని వేలిముద్రలు ప్రపంచవ్యాప్త ఉగ్రవాదంలో కనిపిస్తాయి. ఇది పొరుగు దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి ముప్పు" అని ఐరాసలో భారత్ రెండవ కార్యదర్శి రెంటలా శ్రీనివాస్ విమర్శించారు. ఉగ్ర నేరాలను ఎలాంటి వాదనలు కప్పిపుచ్చలేవని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ప్రతినిధి మళ్లీ మాట్లాడుతుండగా శ్రీనివాస్ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
జైశంకర్ ప్రసంగంలో ఉగ్రవాదాన్ని రాష్ట్ర విధానంగా ప్రకటించే దేశాలను ఖండించాలన్నారు. అక్కడ ఉగ్రవాద కేంద్రాలు పారిశ్రామిక స్థాయిలో నడుస్తాయని తెలిపారు. ఉగ్రవాదులను బహిరంగంగా గౌరవిస్తారని చెప్పారు. ఉగ్రవాద ఆర్థిక సరఫరాను అడ్డుకోవాలని కోరారు. పేరుగాంచిన ఉగ్రవాదులపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థలపై నిరంతర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు తమకు తామే హాని చేసుకుంటారన్నారు. పాక్ పేరు చెప్పకుండా ఉగ్రవాదుల జాబితాలో ఆ దేశ పౌరులే ఎక్కువగా ఉన్నారని, ఏప్రిల్‌లో పహల్గామ్‌లో అమాయక పర్యాటకుల హత్య చేశారని. ఉగ్రవాదంతో సరిహద్దుల్లో హింసాత్మక, అమానవీయ చర్యలను పాల్పడ్డారని చెప్పారు. భారత్ తన ప్రజలను రక్షించుకునే హక్కును వినియోగించిందని, ఉగ్రవాద సంస్థాపకులు, నేరస్థులను న్యాయం ముందు నిలబెట్టిందని వెల్లడించారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమని ఇప్పటికే పలు దేశాలు విమర్శలు చేస్తున్నాయి. వీటిలో ఇజ్రాయెల్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలున్నాయి. ఐరాసలో భారత్ పాక్ వ్యవహారాలను ఎండగట్టే చర్యలకు మరింత బలం చేకూరుతోంది. తాజాగా పాక్ ప్రతినిధి స్పందన మరోసారి పాక్‌ను అబాసుపాలు చేసింది. తమ దేశం పేరు చెప్పకున్నా పాక్ ప్రతిస్పందించడం ఉగ్రవాదాన్ని అంగీకరించినట్టేనన్న విమర్శలకు దారితీసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ సైన్యం పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వీటిని మళ్లీ పునరుద్దరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని భారత్ నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి పాకిస్తాన్ ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఐరాస వేదికలో పాక్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రవాదాన్ని ముగించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో జరిగిన ఘటనలు భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా చైనా, అమెరికా, సౌదీతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉగ్ర స్థావరాలు మళ్లీ నిర్మిస్తున్న నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉంది. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేస్తూ వలసవాదులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
