
ఉగ్రవాదుల టార్గెట్ జనవరి 26
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన పేలుడు కేసులో విస్తుపోయే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ గనీ మొబైల్ ఫోన్ డేటా విశ్లేషణలో ఈ ఏడాది జనవరిలో ఎర్రకోట పరిసరాల్లో పలు మార్లు రెక్కీ నిర్వహించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. రిపబ్లిక్ డే వేడుకల సమయంలో చారిత్రక ఎర్రకోటనే లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో భద్రత కఠినం కావడంతో వారి కుట్ర విఫలమైందని ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే వచ్చే సంవత్సరం మరోసారి ప్రయత్నించాలని రెక్కీ నిర్వహించారు.
ఇటీవల జైషే మొహమ్మద్, అంసార్ ఘజ్వాత్-ఉల్-హింద్ లతో సంబంధాలున్న ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను పోలీసులు బట్టబయలు చేసి ఎనిమిది మందిని, అందులో ముగ్గురు వైద్యులను అరెస్టు చేశారు. ఇదే నేపథ్యంలో ఎర్రకోట సమీపంలో నెమ్మదిగా వెళ్తున్న కారులో భారీ పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు.
40 నమూనాల సేకరణ
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం ఘటనా స్థలంలో నుంచి 40 నమూనాలు సేకరించింది. అందులో అమ్మోనియం నైట్రేట్ అవశేషాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అలాగే రెండు కార్ట్రిడ్జ్‌లు, లైవ్ అమ్యునిషన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ముజమ్మిల్‌తో పాటు అల్‌ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ నబీ ఎర్రకోట పరిసరాల్లో పలు మార్లు తిరిగారు. వారి మొబైల్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. జనవరి 26 న జరిగే గణతంత్ర దినోత్సవాన్నే వారు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక ఫరీదాబాద్‌లోని దౌజ్, ఫతేహ్‌పూర్ టాగా గ్రామాల నుంచి 2,500 కిలోల పేలుడు పదార్థాలైన అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరితో పాటు మరో వైద్యురాలు డాక్టర్ షహీన్ సయీద్‌ను కూడా అరెస్టు చేశారు. అదే యూనివర్సిటీలో నివసిస్తున్న మేవాత్ ప్రాంతానికి చెందిన మౌల్వీ ఇష్టియాక్ ఇంటి నుంచి కూడా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయి. ప్రస్తుతం అతడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేలుడు తరువాత ఢిల్లీలో భారీ భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో గాజీపూర్, సింఘు, టిక్రీ, బదర్పూర్ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు, పారామిలటరీ బలగాలు కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నాయి. ఏ చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టం. ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పించడమే మా లక్ష్యమని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. స్నైఫర్ కుక్కలు, మెటల్ డిటెక్టర్లు, యాంటీ సాబోటేజ్ బృందాలను వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు.
విచారణకు సహకరిస్తున్నాం: ‘అల్‌ఫలాహ్’ విశ్వవిద్యాలయం
ఢిల్లీ సమీపంలో జరిగిన భయంకర పేలుడు ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఫరీదాబాద్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ అల్‌ఫలాహ్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. అరెస్టయిన ఇద్దరు వైద్యులు విశ్వవిద్యాలయానికి కేవలం అధికారిక విధుల్లో మాత్రమే సంబంధం ఉన్నవారని, అంతకుమించి ఎటువంటి అనుబంధం లేదని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ భుపిందర్ కౌర్ ఆనంద్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.
ఈ దుర్ఘటన మాకు తీవ్ర ఆవేదన కలిగించింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు మా సానుభూతిని తెలియజేశారు.
తమ సంస్థకు చెందిన ఇద్దరు వైద్యులను విచారణ సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని వెల్లడిస్తూ దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నాం. నిజాలు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నామని యూనివర్సిటీ వివరణ ఇచ్చింది.పేలుడు పదార్థాలు దొరికిన గదులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాకుండా బయట ఉన్నాయని అధికారులు తెలిపారు. తాజాగా పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలో బృందాన్ని మోహరించి, అక్కడి సిబ్బంది, వైద్యులను విచారించినట్టు సమాచారం.
మరో కారు స్వాధీనం
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో నిందితులతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఫరీదాబాద్ జిల్లా ఖండావళి ప్రాంతంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ పోలీసు ప్రతినిధి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ‘అవును ఆ కారు ఖండావళి గ్రామంలో దొరికింది’ అని ధృవీకరించారు. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు అన్ని స్టేషన్లు, బోర్డర్ చెక్‌పోస్టులకు అలర్ట్ జారీ చేసి ఆ ఎరుపు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును గుర్తించమని ఆదేశించారు. పేలుడు ఘటనలో ఉపయోగించిన హ్యుందాయ్ ఐ20 వాహనానికి సంబంధం ఉన్న మరికొందరు నిందితులు మరో ఎరుపు రంగు కారును కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది.
కారును కనుగొనటానికి ఢిల్లీ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సమీప రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండమని ఆదేశించారు.
ఆ ఎకోస్పోర్ట్ కారు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ పేరిట రిజిస్ట్రేషన్ అయింది. పేలుడు జరగకముందు అతడే ఆ కారును నడిపినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు అన్ని సరిహద్దు యూనిట్లకు పంపించగా, ఢిల్లీ, యూపీ, హర్యానా పోలీసులతో కూడా సమాచారం పంచుకున్నారు. ఆ కారు రెక్కీ కార్యకలాపాలకు ఉమర్ ఉపయోగించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
