Let's talk: editor@tmv.in
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఏకమవ్వాలి: ఐరాసలో భారత్

ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఏకమవ్వాలి: ఐరాసలో భారత్

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలని భారత్ పిలుపునిచ్చింది. ఐసిస్, అల్ ఖైదా వంటి సంస్థలతో పాటు వాటి అనుబంధ ముఠాలను నిర్మూలించడంలో సమిష్టిగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక విభాగం నిర్వహించిన వార్షిక రాయబార స్థాయి సమావేశంలో భారత శాశ్వత మిషన్ ప్రతినిధి, ఫస్ట్ సెక్రటరీ రఘు పురి పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి దేశం, జాతి, మతం అనే తేడాలు ఉండవని.. ఇది ప్రపంచ మనుగడకే ముప్పు అని ఆయన హెచ్చరించారు.

పహల్గామ్ ఘటనపై నిరసన

గతేడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ మారణకాండను రఘు పురి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' జరిపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు దశాబ్దాలుగా సరిహద్దు అవతలి నుంచి సాగుతున్న ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా ఉందని, ఈ మహమ్మారి వల్ల కలిగే సామాజిక, ఆర్థిక, ప్రాణ నష్టాల గురించి తమకు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

వ్యూహాత్మక భాగస్వామ్యం.. ‘ఢిల్లీ డిక్లరేషన్’

గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ (జీసీటీఎస్)ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత్ ఉద్ఘాటించింది. ఈ వ్యూహానికి సంబంధించి జరగనున్న 9వ సమీక్షా సమావేశాల్లో ఫిన్లాండ్, మొరాకో దేశాలకు పూర్తి సహకారం అందిస్తామని రఘు పురి హామీ ఇచ్చారు. 2022లో ఐరాస ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి భారత్ అధ్యక్షత వహించినప్పుడు రూపొందించిన 'ఢిల్లీ డిక్లరేషన్' ప్రాముఖ్యతను ఆయన వివరించారు. కొత్త సాంకేతికతలను ఉగ్రవాదులు వాడుకోకుండా అడ్డుకోవడంలో ఈ డిక్లరేషన్ ఒక మైలురాయిగా నిలిచిందని గుర్తు చేశారు.

సామర్థ్యం పెంపునకు సహకారం

ఉగ్రవాదం నిరంతరం తన రూపాన్ని మార్చుకుంటూ సవాళ్లు విసురుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఎదుర్కొనేందుకు ఐరాసకు చెందిన వివిధ విభాగాలతో కలిసి భారత్ పనిచేస్తోందని, భాగస్వామ్య దేశాల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామని రఘు పురి వెల్లడించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజాన్ని సిద్ధం చేయడమే భారత్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఏకమవ్వాలి: ఐరాసలో భారత్ - Tholi Paluku