Let's talk: editor@tmv.in
ఉగాది పండుగ రోజు గద్దర్ సినీ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి

ఉగాది పండుగ రోజు గద్దర్ సినీ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

తెలుగు చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల నిర్వహణ, ఎంపిక ప్రక్రియపై బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జ్యూరీ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం ప్రాంతీయ సినిమాకే కాకుండా, దేశవ్యాప్త చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సకల భాషల సినీ ఇండస్ట్రీలు, హైదరాబాద్ కు తరలివస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సినీ ప్రపంచ మార్కెట్‌కు హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన బ్లూ ప్రింట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన అపూర్వ వ్యక్తిగా ఆయనను డిప్యూటీ సీఎం కొనియాడారు. అందుకే గద్దర్ స్మరణార్థంగా గత సంవత్సరం నుంచి సినిమా అవార్డులను ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గద్దర్ సినిమా అవార్డుల ఎంపికలో ప్రతిభ, పారదర్శకత మాత్రమే ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రశంసలు పొందిన విషయాన్ని గుర్తు చేశారు.

సినీ రంగ ప్రముఖుల అనుభవం, నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఉగాది పండుగ రోజైన మార్చి 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉగాది పండుగ రోజు గద్దర్ సినీ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి - Tholi Paluku