Let's talk: editor@tmv.in
ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్ సిద్ధం కావాలి: మంత్రి దామోదర్ ఆదేశం

ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్ సిద్ధం కావాలి: మంత్రి దామోదర్ ఆదేశం

Gaddamidi Naveen
18 ఫిబ్రవరి, 2026

సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రి పనులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులతో కలిసి టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది నాటికి ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆసుపత్రికి నీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని, 24 గంటలపాటు నిరంతర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతి అంతస్తులో పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించాలని అగ్నిమాపక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పర్యటనలో భాగంగా మంత్రి రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ గదులు, డయాగ్నస్టిక్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ వంటి విభాగాలను పరిశీలించారు. రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓపీ, ఫార్మసీ కౌంటర్ల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు.

సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక వైద్య పరికరాలను కూడా మంత్రి పరిశీలించారు. ఈ అధునాతన యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు ఉపయోగపడేలా అవసరమైన డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.