
ఉగాది - కొత్త ఆశల ఆరంభం
తెలుగు ప్రజల హృదయాల్లో జనవరి 1 కంటే ఎక్కువగా ప్రతిధ్వనించేది ఉగాది అనే పవిత్ర నూతన సంవత్సరం. ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు. మన ఇంటి ముందు ముగ్గుల రంగుల్లో, మామిడి తోరణాల సువాసనలో, అమ్మ చేతి ఉగాది పచ్చడి రుచిలో కొత్త ఆశల ప్రారంభాన్ని సూచించే భావోద్వేగ క్షణం. చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజున ఉగాదిని కొత్త జీవితానికి నాందిగా భావించి జరుపుకుంటారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు, పిల్లల చిరునవ్వులు కలిసి ఈ రోజును మరింత హృదయస్పర్శిగా మార్చుతాయి. అందుకే తెలుగు ప్రజలకు ఉగాది అంటే ఒక పండుగ మాత్రమే కాదు… అది వారి సంస్కృతికి, ఆత్మీయతకు, కొత్త కలలకు ప్రతీకగా నిలిచే మధురమైన ఆరంభం. మరి అలాంటి ఉగాది గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం…
ఉగాది అనేది కేవలం ఒక పండుగ కాదు. అది జీవితం పట్ల ఉన్న ఆశను, కొత్త ప్రారంభాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించే రోజు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ రోజు ఒక కొత్త సంవత్సరానికి ఆరంభం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను అత్యంత భక్తి, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఉగాది అంటే “యుగాది” అనే సంస్కృత పదం నుండి వచ్చింది. “యుగ” అంటే కాలచక్రం లేదా యుగం, “ఆది” అంటే ప్రారంభం. అంటే కొత్త యుగం ప్రారంభం అని అర్థం. ఈ రోజు కొత్త ఆశలతో, కొత్త సంకల్పాలతో జీవితం ప్రారంభించడానికి సూచికగా భావిస్తారు.
పురాణాల ప్రకారం..
చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజునే ఈ జగత్తు సృష్టి ప్రారంభమైందని హిందూ పురాణాల్లో విశ్వాసం ఉంది. సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు కాలగణనను గ్రహాలు, నక్షత్రాలు, ఋతువులు, మాసాలు, సంవత్సరాల వ్యవస్థను ఆరంభించాడని చెబుతారు. అందుకే ఈ రోజును సృష్టి ఆరంభానికి నాందిగా భావించి ఉగాది పండుగను జరుపుకుంటారు.
మరో పురాణకథ ప్రకారం, సోమకుడు వేదాలను అపహరించగా విష్ణువు మత్స్యావతారం ధరించి వాటిని తిరిగి సాధించి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భాన్నే ఉగాది ఆవిర్భావంగా భావిస్తారు. అదేవిధంగా శాలివాహనుడు పట్టాభిషేకం పొందిన రోజు కూడా ఇదేనని ఒక గాధ ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే కాల ద్వయానికి ఆరంభంగా, అలాగే నక్షత్ర గమనానికి మొదటిగా ఈ రోజును గుర్తిస్తూ, వసంత ఋతువు ఆరంభంతో కలిసి కొత్త జీవితం ప్రారంభమవుతుందనే భావనతో ఉగాదిని అత్యంత పావనంగా ఆచరిస్తారు. పౌరాణిక విశిష్టత చూస్తే బ్రహ్మదేవుడు ఈ రోజున సూర్యోదయ వేళ సృష్టిని సృష్టించాడని, కాలగణన (సంవత్సరాలు, నెలలు) ప్రారంభించాడని నమ్మకం.
60 పేర్లతో కాలచక్రం..
హిందూ కాలచక్రంలో మొత్తం 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన పేరుతో పిలవబడుతుంది. ఈ పేర్లు పునరావృతమయ్యే క్రమంలో వస్తాయి. అంటే 60 సంవత్సరాలు పూర్తయిన తరువాత మళ్లీ అదే పేర్ల క్రమం మొదలవుతుంది. ఈ 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మొదటి సంవత్సరం ప్రభవ పేరుతో మొదలవుతుంది. ఈసారి జరుపుకుంటున్నది పరాభవ నామ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొత్త సంవత్సర పేరు ప్రారంభమవుతుంది. ఈ విధంగా సంవత్సరాలకు పేర్లు పెట్టడం వల్ల కాలాన్ని గుర్తించడం సులభమవుతుంది ప్రతి సంవత్సరం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
ఈ 60 సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక విశిష్టత, ఆధ్యాత్మిక భావం ఉంటుంది. కొన్ని సంవత్సరాలు శుభకరంగా భావిస్తారు, కొన్ని సంవత్సరాలు ప్రత్యేక సంఘటనలకు గుర్తుగా నిలుస్తాయి. ఈ పేర్లు ప్రకృతి మార్పులు, పంటలు, సమాజ పరిస్థితులు ధార్మిక విశ్వాసాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరం కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ప్రారంభమవుతుంది. ఉగాది రోజున వచ్చే ఈ కొత్త సంవత్సరం మనకు జీవితంలో కొత్త దారులు, కొత్త అవకాశాలు, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని విశ్వాసం ఉంది.
ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది. సాధారణంగా ఇది మార్చి చివరి లేదా ఏప్రిల్ ప్రారంభంలో వస్తుంది. ఈ సమయం ప్రకృతి కూడా కొత్తదనాన్ని స్వీకరిస్తుంది. చెట్లు పుష్పిస్తాయి, పచ్చదనం విస్తరిస్తుంది, వసంత ఋతువు తన అందాన్ని చూపిస్తుంది. ప్రకృతిలో కనిపించే ఈ మార్పు మనసుల్లో కూడా మార్పు తీసుకువస్తుంది. అందుకే ఉగాది రోజున మనం గతాన్ని వదిలి, భవిష్యత్తు కోసం కొత్త దారిని ఎంచుకోవాలని భావిస్తారు.
ఉగాది పండుగకు ముందు నుంచే ఇళ్లలో సన్నాహాలు మొదలవుతాయి. ఇళ్లను శుభ్రం చేసి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ శుభ్రత కేవలం ఇంటి వరకు మాత్రమే కాదు. మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకోవడం కూడా దీని భాగం. చాలా కుటుంబాలు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తాయి. పిల్లలు, పెద్దలు అందరూ కొత్త బట్టలు ధరించి పండుగను జరుపుకుంటారు. ఇది ఆనందానికి, కొత్త ప్రారంభానికి సంకేతం.
ఉగాది రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇళ్ల ప్రవేశ ద్వారాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు. మామిడి ఆకులు ఇంటికి తోరణంగా కడతారు, వీటిని హిందువులు శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇంటి ముందు రంగోలి (ముగ్గులు) వేస్తారు. రంగుల పొడితో అందమైన నమూనాలు గీయడం ఉగాది ప్రత్యేకత. ఈ రంగోలి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. పిల్లలు పెద్దలు దేవాలయాలకు వెళ్ళి నూతన సంవత్సరాన్ని ఆధ్యాత్మిక భావంతో మొదలుపెడతారు.
షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన అంశం ఉగాది పచ్చడి. పచ్చడి అనేది షడ్రుచులను (ఆరు రకాల రుచులను) కలిపి తయారు చేస్తారు. తీపి,పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. బెల్లం తీపి రుచిని కలిపి ఒకేసారి ఉగాది పచ్చడిలా సేవిస్తారు. చింతపండు పుల్లని రుచిని సూచిస్తుంది. ఉప్పు ఉప్పదనాన్ని, వేప పువ్వులు చేదును, పచ్చి మిరపకాయలు కారాన్ని, పచ్చి మామిడి వగరును సూచిస్తాయి. ఈ ఆరు రుచులు కలిపి తయారు చేసే పచ్చడి జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను సూచిస్తుంది. జీవితం ఎప్పుడూ తీపిగా ఉండదు. కొన్ని సార్లు చేదుగా ఉంటుంది. కానీ అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాలి అనే సందేశం ఈ పచ్చడి ద్వారా అందుతుంది.
కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉగాది పచ్చడి తింటారు. ఇది కుటుంబ ఐక్యతను పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పులిహోర, బొబ్బట్లు, బూరెలు వంటి వంటకాలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కర్ణాటకలో హోళిగే, బెల్లం-వేప మిశ్రమం “బేవు-బెల్ల” తయారు చేస్తారు. బేవు-బెల్ల జీవితం తీపి, చేదు అనుభవాల సమ్మేళనం అని సూచిస్తుంది. ఈ సంప్రదాయం ద్వారా పిల్లలకు జీవితం పట్ల సరైన దృక్పథం నేర్పుతారు.
పంచాంగ శ్రవణం
ఉగాది సందర్భంగా జరిగే ముఖ్యమైన ఆచారాల్లో పంచాంగ శ్రవణం ప్రత్యేకమైనది. ఈ రోజు ఆలయాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని పండితులు లేదా పెద్దలు చదివిస్తారు. ఇందులో ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, రాశిఫలాలు, వర్షపాతం పరిస్థితులు, పంటల పరిస్థితి, శుభముహూర్తాలు వంటి విషయాలను వివరంగా చెబుతారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా ప్రజలు తమ జీవితానికి మార్గదర్శకత్వం పొందుతారని నమ్మకం. అలాగే భవిష్యత్తు పై ఒక అవగాహన కలిగి, అనుకున్న పనులను సక్రమంగా ప్రణాళిక చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇది కేవలం జ్యోతిష్య పరమైన అంశం మాత్రమే కాకుండా, మన సంప్రదాయ జ్ఞానాన్ని తరతరాలకు అందించే ఒక సాంస్కృతిక ప్రక్రియ కూడా, అలాగే ఉగాది కొత్త ఆరంభాలకు సంకేతంగా భావించి నూతన కార్యక్రమాలు చేపడతారు.
వివిధ పేర్లతో ఉగాది
ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్న పేర్లతో, ప్రత్యేక సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాదిగా, కర్ణాటకలో యుగాదిగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, గోవాలో ఇదే రోజును గుడి పడ్వాగా, తమిళనాడులో పుత్తాండు, కేరళలో విషు, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. ఏ ప్రాంతంలో ఏ పేర్లతో పిలిచినా ఇవ్వన్నీ కొత్త సంవత్సర ఆరంభాన్ని సూచిస్తాయి. ప్రతి ప్రాంతంలో ఆచారాలు మారినా, ఉద్దేశ్యం మాత్రం ఒకటే కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించడం, శుభాకాంక్షలు పంచుకోవడం, జీవితం లో కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలను స్వీకరించడం.
ఉగాది రోజున దానధర్మాలు చేయడం కూడా ముఖ్యమైనది. పేదలకు ఆహారం, బట్టలు ఇవ్వడం ద్వారా సేవా భావం పెరుగుతుంది. ఇది సమాజంలో సహాయం, ప్రేమను పెంపొందిస్తుంది. పెద్దలు పిల్లలకు ఆశీర్వాదం ఇస్తారు. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయం. ఈ విధంగా ఉగాది పండుగ కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఉగాది కేవలం ఒక ప్రాంతీయ పండుగ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా ఈ రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు. ఈ విధంగా ఉగాది భారతదేశ సంస్కృతిలో ముఖ్యమైన స్థానం పొందింది. అందుకే ఇది కాలచక్రాన్ని గౌరవించే పండుగ.
