Let's talk: editor@tmv.in
ఉగాదికి సనత్‌నగర్ ‘టిమ్స్‌’ ప్రారంభం!

ఉగాదికి సనత్‌నగర్ ‘టిమ్స్‌’ ప్రారంభం!

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ పర్వదినాన ఈ ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణం, పరికరాల అమరిక, వైద్యసేవల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సనత్‌నగర్ టిమ్స్ పనుల పురోగతి, వైద్యులు, అలాగే సిబ్బంది నియామకాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ విభాగాలు, డయాగ్నస్టిక్స్ యూనిట్లు, ఇన్‌పేషెంట్ విభాగాలు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ ఏర్పాట్లపై అధికారులు వివరాలు అందించారు. 1000 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయని, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్‌రే వంటి అత్యాధునిక నిర్ధారణ పరికరాల ఇన్‌స్టాలేషన్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన డయాగ్నస్టిక్ యంత్రాల అమరికను త్వరితగతిన పూర్తి చేసి మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు ముగించాలని మంత్రి సూచించారు. ఆసుపత్రి ప్రారంభానికి ముందే టెక్నీషియన్లు, వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తిచేయాలని కూడా ఆదేశించారు.

సనత్‌నగర్ టిమ్స్‌ను కార్డియాక్ కేర్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించేలా క్యాథ్‌ల్యాబ్స్, ప్రత్యేక ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై కూడా సమీక్షించారు.

ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.సనత్‌నగర్ టిమ్స్ రూ. 900 కోట్ల నుంచి రూ.1100 కోట్ల మధ్య వ్యయంతో నిర్మితమైన భారీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా చెప్పవచ్చు.

ఉగాదికి సనత్‌నగర్ ‘టిమ్స్‌’ ప్రారంభం! - Tholi Paluku