
ఉగాదికి ‘మెగా’ జాబ్ క్యాలెండర్: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఉగాది పర్వదినం నాటికి రాష్ట్రంలో 'మెగా జాబ్ క్యాలెండర్' విడుదల చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్,అదితి గజపతిరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
కేజీబీవీల బలోపేతానికి ప్రాధాన్యం
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ) దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని లోకేష్ కొనియాడారు. గత రెండేళ్లలో ఇక్కడ అడ్మిషన్ల కోసం భారీ పోటీ నెలకొందని ఫలితాల్లోనూ గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. కేజీబీవీ సిబ్బంది వేతనాల పెంపు అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మెంద్ర ప్రధాన్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. "ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకం (60:40 నిష్పత్తి). కేంద్రం నుంచి ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆమోదం లభించిన వెంటనే వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 11 వేల మంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారని ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే మెరుగైన వేతనాలు అందుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఉద్యోగాల భర్తీకి కసరత్తు
గత ఏడాది 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని రాబోయే జాబ్ క్యాలెండర్‌లోనూ భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు, జోనల్ రీ-నోటిఫికేషన్ వంటి సాంకేతిక అంశాలను పరిష్కరిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన రీతిలో నియామకాలు చేపడతామన్నారు.
విజయనగరం పాలిటెక్నిక్‌కు మహర్దశ
విజయనగరం పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధిపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వచ్చే ఏడాది 'సాస్కీ' పథకం కింద ఈ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవన నిర్మాణ వ్యయం గతంలో రూ.8 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.10 కోట్లకు చేరిందని మరమ్మతుల కోసం మరో రూ. 1.10 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఉత్తరాంధ్రలో డేటా సిటీ, ఫార్మా, స్టీల్ వంటి క్లస్టర్లు ఏర్పడుతున్న నేపథ్యంలో పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా పాలిటెక్నిక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని లోకేష్ పేర్కొన్నారు. 2019లో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి విజయనగరంలో దేశంలోనే తొలి 'ఏవియేషన్ ఎడ్యుసిటీ’ ని బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
