Let's talk: editor@tmv.in
ఉగ్ర స్థావరాలకు వరద సాయం నిధులు!

ఉగ్ర స్థావరాలకు వరద సాయం నిధులు!

Venkatesh Balusula
15 సెప్టెంబర్, 2025

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. భారత్ పాకిస్థాన్పై జరిపిన ఆపరేషన్ సిందూర్లో లష్కరే తోయిబా ప్రధాన క్యాంపు కార్యాలయం మర్కాజ్ తోయిబా ధ్వంసమైంది. ఈ కేంద్రాన్ని లష్కర్ఏ తోయిబా తిరిగి నిర్మించే పనిలో పడింది. ఈ సంస్థ ప్రభుత్వ నిధులతో పాటు, వరద బాధితుల సాయం కోసం సేకరించిన డబ్బును ఈ ఉగ్రవాద కేంద్రం పునర్నిర్మాణానికి ఉపయోగిస్తోందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

ముమ్మరంగా సాగుతున్న పనులు

మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్లో మర్కాజ్ తోయిబా కేంద్రంలోని మూడు ముఖ్యమైన భవనాలైన క్యాడర్ వసతి, ఆయుధ నిల్వ, శిక్షణ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 18 నుంచి ఐదు జేసీబీ యంత్రాలతో ఈ శిథిలాలను తొలగించే పని ప్రారంభించారు. ఆగస్టు 20 నాటికి ఉమ్ముల్ ఖురా శిక్షణ కేంద్రం భాగం కూల్చివేయగా, సెప్టెంబర్ 4 నాటికి అది పూర్తిగా ధ్వంసమైంది. సెప్టెంబర్ 7 నాటికి వసతి భవనం కూడా పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు జరుగుతోంది. ఆ తర్వాత నూతన భవనాల నిర్మాణం ప్రారంభం కానుంది.

ముందుగానే ప్రకటించిన పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ ప్రభుత్వం మేలో జరిగిన నాలుగు రోజుల సంఘర్షణలో దెబ్బతిన్న ఉగ్రవాద సంస్థల సౌకర్యాలను పునర్నిర్మించేందుకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్ఈటీకి ఆగస్టు 14న రూ.4 కోట్ల ప్రారంభ సాయం అందింది. అయితే, ఈ కేంద్రాన్ని పూర్వ వైభవంతో నిర్మించడానికి రూ.15 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సంస్థ అంచనా వేసింది. ఈ నిధుల కొరతను పూడ్చేందుకు ఎల్ఈటీ వరద బాధితుల సాయం పేరుతో నగదు సేకరణ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో సాగుతున్నాయి. ఈ సేకరణలు బయటకు సాయం కోసమని చెప్పినా, వాస్తవానికి ఈ డబ్బు ఉగ్రవాద కేంద్రాల పునర్నిర్మాణానికి వినియోగిస్తున్నారని సమాచారం. 2005లో పాకిస్తాన్, పీవోకేలలో సంభవించిన భూకంపం తర్వాత కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించారు. అప్పట్లో జమాత్ ఉద్ దావా పేరుతో ఎల్ఈటీ సేకరించిన కోట్లాది రూపాయలలో 80 శాతం ఉగ్రవాద సౌకర్యాలకు మళ్లించారు.

ఫిబ్రవరి 5 వరకు నిర్మాణాలు పూర్తి

ప్రస్తుతం మర్కాజ్ తోయిబా పునర్నిర్మాణాన్ని సీనియర్ ఎల్ఈటీ నాయకులు మౌలానా అబు జర్, శిక్షణకర్త ఉస్తాద్ ఉల్ ముజాహిద్దీన్, ఆపరేషనల్ కమాండర్ యూనస్ షా బుఖారీలు పర్యవేక్షిస్తున్నారు. మే దాడి తర్వాత, క్యాడర్ శిక్షణ, వసతిని మొదట బహవల్పూర్లోని మర్కజ్ అక్సాకు, ఆ తర్వాత జూలై నాటికి కసూర్ జిల్లాలోని పటోకీలోని మర్కాజ్ యర్మూక్కు మార్చారు. వరద బాధితుల సాయం పేరుతో జరుగుతున్న నిధి సేకరణ, ఉగ్రవాద సౌకర్యాల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతోందని స్పష్టమవుతోంది. పాకిస్థానీ రేంజర్స్, అధికారులతో కలిసి ఎల్ఈటీ క్యాడర్లు సాయం శిబిరాల్లో ఫొటోలు దిగుతూ, నిధులను తమ అవసరాలకు మళ్లిస్తున్నారు. శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి, 2026 ఫిబ్రవరి 5 నాటికి కాశ్మీర్ సాలిడారిటీ డే సమావేశానికి ముందు కొత్త సౌకర్యాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉగ్ర స్థావరాలకు వరద సాయం నిధులు! - Tholi Paluku